కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనుకు ప్రాణహాని

by Seetharam |   ( Updated:2023-09-01 07:28:05.0  )
కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనుకు ప్రాణహాని
X

దిశ, డైనమిక్ బ్యూరో : కోడికత్తి కేసుపై విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో గాయపడ్డ వ్యక్తి, బాధితుడు అయిన వైఎస్ జగన్ ఎందుకు విచారణకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి ఒక డ్రామా ఆడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆరోపించారు. ఈ డ్రామా అంత టీడీపీ మీద నెట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. విశాఖ విమానాశ్రయంలో కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడేనని న్యాయవాది బయటపెట్టారని గుర్తు చేశారు. న్యాయవాది ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు టీడీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కోడికత్తిని ఎయిర్ పోర్టులోకి తీసుకువచ్చింది మజ్జి శ్రీనివాసరావేనన్న న్యాయవాది ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సింది పోయి ఇందులో టీడీపీని లాక్కురావడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ కేసును పరిశీలిస్తే జైల్లో ఉన్న నిందితుడు జనిపల్లి శ్రీనుకి ప్రాణ హాని ఉందన్న అనుమానం తమకు కలుగుతుందని అన్నారు. నిందితుడు జనిపల్లి శ్రీనుకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మీ ఎమ్మెల్సీ దళిత యువకుడు ని చంపి జైల్లో కి వెళ్లి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. దళితుడు కాబట్టే కోడికత్తి కేసులో జనిపల్లి శ్రీనుకి బెయిల్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అని కిమిడి నాగార్జున ఆరోపించారు. దళితులు అంటే వైసీపీకి చిన్నచూపు అని విమర్శించారు. అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్, బాబాయ్‌పై హత్యకేసులోవైఎస్ అవినాశ్ రెడ్డిలు బెయిల్‌పై తిరుగుతున్నారని కానీ నాలుగేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీను మాత్రం జైల్లో మగ్గుతున్నాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story