జనసేన, బీజేపీ సెగ్మెంట్లలో దూసుకుపోతున్న వైసీపీ.. సైకిల్ పార్టీలో మొదలైన ఆందోళన

by GSrikanth |
జనసేన, బీజేపీ సెగ్మెంట్లలో దూసుకుపోతున్న వైసీపీ.. సైకిల్ పార్టీలో మొదలైన ఆందోళన
X

ఐదేళ్ల వైసీపీ పాలనపై అనేక వర్గాల్లో వ్యతిరేకత నెలకొంది. తెలంగాణలో గత సీఎం కేసీఆర్​మాదిరిగా జగన్ ఒంటెత్తు పోకడలు మధ్య తరగతి ప్రజలను తీవ్ర అసంతృప్తిలోకి నెట్టాయి. పథకాలపై మితిమీరిన ప్రచారం సగటు ప్రజలకు వెగటు పుట్టిస్తోంది. మా భూ హక్కు పత్రాలపై జగన్ బొమ్మేంటని రైతులు చిరాకు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులు సైతం వైసీపీని తిరిగి గట్టెక్కించే పరిస్థితుల్లేవు. మరోవైపు ప్రజలకు సంక్షేమంతో కూడిన అభివృద్ధిని ఎలా అందిస్తారో స్పష్టం చేయలేని దుస్థితిలో ఎన్డీయే కూటమి పక్షాలున్నాయి. ప్రచారంలో విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలి ఇండియా కూటమికి ఓటింగ్​పెరిగే అవకాశాలున్నాయి. ఇది టీడీపీ విజయావకాశాలను దెబ్బ తీయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: ఎన్డీయే కూటమిలో కలిస్తే సీఎం జగన్ దూకుడుకు కళ్లెం వేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ, బీజేపీ బంధాన్ని సరిగ్గా అంచనా వేయలేక పప్పులో కాలేసినట్లు తెలుస్తోంది. జగన్, మోడీ-షాల మాయోపాయంలో జనసేనాని ద్వారా టీడీపీ చిక్కుకున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును మూడు పార్టీల శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదు. చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీకి వచ్చిన మైలేజీ ఇప్పుడు కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.

టీడీపీ తప్పటడుగులు..

వైసీపీ పాలనలో విసుగెత్తిన ప్రజలను ఆకట్టుకోవడంలో టీడీపీ వైఫల్యం కనిపిస్తోంది. జగన్​ నియంతృత్వ తీరుకు భిన్నంగా ప్రజాస్వామ్యయుత పాలన ఎలా అందిస్తామనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లలేకపోయింది. ప్రత్యామ్నాయ విధానాలను ప్రకటించలేక కాపీ పేస్ట్​ పథకాల హామీతో విఫలమైంది. కునారిల్లుతున్న వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలను ఎలా పెంపొందిస్తామో వెల్లడించలేని దుస్థితిలోకి జారిపోయింది. ఐటీ ఉద్యోగాల కల్పన భరోసా ఒక్కటే సామాన్యులను ఆకర్షించలేకపోతోంది. అసలు ఈ అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టకుండా పొత్తులతో గట్టెక్కాలని భావించడమే బూమరాంగ్​ అయినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ స్థానాల్లో ఫ్యాన్ గాలి..

ప్రస్తుతం బీజేపీ, జనసేన పోటీ చేస్తోన్న సెగ్మెంట్లలో వైసీపీ ముందుకు దూసుకుపోతోంది. పిఠాపురం, తెనాలిలో తప్ప మిగతా స్థానాల్లో వైసీపీ ముందంజలోనే ఉంది. చావోరేవో నిర్ణయించే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పోటీ చేసే 8 పార్లమెంటు, 31 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగితే టీడీపీ విజయావకాశాలు సన్నగిల్లినట్లే. ఈ రెండు పార్టీలతో టీడీపీ పొత్తు వల్ల ఎవరికి ప్రయోజనమనే రీతిలో తెలుగు తమ్ముళ్లలో అంతర్మథనం సాగుతోంది. గెలిచినా ఓడినా టీడీపీని కబళించడానికే అన్నట్లుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక..

అధికార వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎన్డీయే కూటమి పక్షాలు నిలవలేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు వివేక హత్య అంశం రాయలసీమలో ముందుకు రావడం, వైఎస్​ కుటుంబ సభ్యులు షర్మిలకు అండగా నిలవడం వైసీపీని బాగా డ్యామేజ్​ చేసేట్లున్నాయి. బీజేపీ మీద రాష్ట్ర ప్రజల ఆక్రోశం, ఆ పార్టీతో టీడీపీ పొత్తు వల్ల ఇండియా కూటమి పక్షాలైన కాంగ్రెస్​, వామపక్షాల ఓటింగ్ పెరిగే అవకాశాలున్నాయి. ఈ పరిణామం ఎవరి విజయావకాశాలను దెబ్బకొడుతుందనే అంశం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

Next Story