బీసీలు నమ్మేది లేదు.. మళ్లీ ఓటేసేది లేదు: Kollu Ravindra

by srinivas |
బీసీలు నమ్మేది లేదు.. మళ్లీ ఓటేసేది లేదు: Kollu Ravindra
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు రాజ్యాంగబద్దంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కిన 34 శాతం రిజర్వేషన్లను కుదించి.. 16,800 మందికి పదవులు రాకుండా చేసిన జగన్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే అర్హత ఎంత మాత్రం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. 'బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాల్సిన రూ.34 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని మళ్లించారు. 8 వేల ఎకరాల బీసీల అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. సుమారు 26 మంది బీసీ నేతల్ని అత్యంత కిరాతకంగా హత్యలు చేశారు. వందల మందిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. వేలాది మందిపై దాడులకు పాల్పడ్డారు' అని కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన అనంతరం బీసీలకు పెద్దపీట వేశమంఅంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కొల్లు రవీంద్ర ఓ ప్రకటన విడుదల చేశారు.

'బీసీలను ఆర్ధికంగా, సామాజికంగా వృద్ధి చెందేలా చేసే 30కి పైగా అభివృద్ధి పథకాలను నిలిపివేశారు. చేతి వృత్తుల వారికి చేదోడుగా నిలిచే ఆదరణ పథకాన్ని దూరం చేశారు. కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. ఇలా అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. బీసీలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కి ఒకరిద్దరికి పదవులు కట్టబెట్టి రాజకీయంగా వాడుకున్నంత మాత్రాన జగన్ రెడ్డిని బీసీలు నమ్మే పరిస్థితి లేదు. జనాభాలో సుమారు 50 శాతం పైగా ఉన్న బీసీలకు కనీస బడ్జెట్ కేటాయింపులు కూడా చేయని జగన్ రెడ్డి చేసే ఇలాంటి జిమ్మిక్కుల్ని బీసీలు నమ్మబోరు. ఎన్ని రాజకీయ కుయుక్తులు పన్నినా, తలకిందులుగా తపస్సు చేసినా, పదవులివ్వడం కాదు పొర్లు దండాలు పెట్టినా బీసీలు జగన్ రెడ్డీ నిన్ను నమ్మేది లేదు. మళ్లీ ఓటేసేది లేదు' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed