జగన్కు భయాన్ని పరిచయం చేస్తా.. చిత్తూరులో లోకేష్

by Javid Pasha |
జగన్కు భయాన్ని పరిచయం చేస్తా.. చిత్తూరులో లోకేష్
X

దిశ, తిరుపతి: చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్ ఇవాళ మరోసారి జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి పని అయిపోయిందని, తెలుగుదేశం ప్రభుత్వం వస్తోందని, అందరి సమస్యలు పరిష్కరిస్తుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. జగన్ జనం మధ్య తిరగలేకపోతున్నాడని, ప్యాలెస్ పిల్లి ఒక వేళ బయటకొచ్చినా పరదాలు కట్టుకుని తిరుగుతోందని లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రజాదరణలో మనం పబ్లిక్ గా తిరుగుతున్నామని, మనది ప్రజాబలమని టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జనం ఆశీస్సులతో యువగళం పాదయాత్ర చేయగలుగుతున్నామని, తన ప్రచార రథం, మైక్ సీజు చేశారని లోకేష్ ఆరోపించారు.

జగన్ రెడ్డి నీకు తెలుగుదేశం అంటే ఎందుకు ఇంత భయం? అని ప్రశ్నించారు. టీడీపీ మద్దతుదారులంటూ విద్యార్థులపై అటెంటివ్ మర్డర్ కేసులు పెట్టారని, కోర్టు చీవాట్లు పెట్టడంతో పోలీసులు విద్యార్థుల్ని వదిలేశారన్నారు. చట్టాలు ఉల్లంఘించి మరీ టీడీపీ కేడర్ , లీడర్లపై కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయిస్తామన్నారు. తప్పుడు మార్గంలో చట్టాలు ఉల్లంఘించే పోలీసులకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. జగన్ మోహన్ రెడ్డికి అసలైన భయం పరిచయం చేసే బాధ్యత నాదేనని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 2024 తరువాత జగన్ అనే వ్యక్తి ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా చేస్తానన్నారు.


లోటు బడ్జెట్ తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సాధించడంలో చంద్రబాబు విశేష కృషి చేశారని, కంపెనీలు రప్పించి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని లోకేష్ తెలిపారు. మహిళలకు పసుపు కుంకుమ కింద 20 వేలకోట్లు ప్రయోజనాలు కల్పించారన్నారు. చాలీచాలని పెన్షన్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న అవ్వాతాతలకు పింఛను రూ. 2 వేలకి పెంచారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని, ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని లోకేష్ గుర్తుచేశారు.. ప్రతీ నెల ఒకటో తారీఖుని జీతాలు చెల్లించామని, బాబు ఒక బ్రాండ్- జగన్ అంటే జైలన్నారు.అభివృద్ధి వికేంద్రీకరణని రాష్ట్రానికి పరిచయం చేసింది చంద్రబాబేనని లోకేష్ తెలిపారు.

రాయలసీమకి కియా, ఫాక్స్ కాన్, సెల్ కాన్, డిక్సన్, అపోలో టైర్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలు తెప్పించారన్నారు. ఈ ప్రాంత యువత 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తున్న సమయంలో ఒక్క చాన్స్ ఇవ్వండని వేడుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని లోకేష్ విమర్శించారు. మోసానికి మానవరూపం జగన్ రెడ్డి, అందుకే జగన్ మోసపు రెడ్డి అని పేరు పెట్టామన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని యవతని ఛీట్ చేశాడని, ప్రత్యేక హోదాని కేసుల కోసం తాకట్టు పెట్టాడన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో మోసగించాడని, 45 ఏళ్ల దాటిన మైనారిటీ ఎస్సీ,ఎస్టీ, బీసీల మహిళలకు పెన్షన్ ఇస్తానని మోసం చేశాడన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చీట్ చేశారన్నారు.

ఇవి కూడా చదవండి : తిరుపతి-గుంతకల్ రైలు వేళల్లో మార్పు

Next Story

Most Viewed