కలిస్తేనే గెలుస్తాం: టీడీపీ-జనసేన కలయికపై నందమూరి బాలకృష్ణ

by Seetharam |   ( Updated:2023-11-16 06:37:02.0  )
కలిస్తేనే గెలుస్తాం: టీడీపీ-జనసేన కలయికపై నందమూరి బాలకృష్ణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం, జనసేన పార్టీల ఆత్మీయ కలయిక కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో గురువారం జరిగిన టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కలిస్తేనే గెలవగలం అంటూ బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంగీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ యజ్ఞంలో తాను సైతం ఒక సమిధిగా ఉంటానని పవన్ కల్యాణ్ ముందుకు రావడం అభినందనీయం అని నందమూరి బాలకృష్ణ కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని..ఆ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రజలంతా బయటకు వచ్చి వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. ఇకపోతే నియోజకవర్గం ఆత్మీయ సమావేశంలో నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం, జనసేన పార్టీ కండువాలను ధరించి హాజరయ్యారు. అంతేకాదు జై తెలుగుదేశం, జై జనసేన పార్టీ అంటూ నందమూరి బాలకృష్ణ నినదించారు.

అప్పులు ఊబిలో ఏపీ

తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారని నందమూరి బాలకృష్ణ అన్నారు. వైసీపీ అరాచకపాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నందమూరి బాలకృష్ణ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం అని నందమూరి బాలకృష్ణ అన్నారు. వైసీపీ పాలనలో నేరస్థులు రాజ్యమేలుతున్నారని నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి అని టీడీపీ, జనసేన నాయకులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ప్రజలంతా బయటకు వచ్చి ఉద్యమించాలి అని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

పవన్ కల్యాణ్ నా సోదరుడు

ఇకపోతే రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు తాము సిద్ధమని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసి పనిచేసేలా దిశానిర్దేశం చేసిన పవన్ కల్యాణ్‌కు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒకరినొకరు సహాయసహకారాలతో ముందుకు వెళ్దామని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed