అధిక ధరలతో జనజీవనం అస్తవ్యస్తం.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

by Javid Pasha |
అధిక ధరలతో జనజీవనం అస్తవ్యస్తం.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
X

దిశ, డైనమిక్ బ్యూరో : నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ప్రజలు విల విల్లాడుతున్నారు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. పెరిగిన కాయగూరల ధరలు, ఇంట్లో నిత్యం వాడే వస్తువుల ధరలు భగ్గు మంటున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏం కొనేటట్లు లేదు, తినేటట్లు లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అధిక ధరలు, ప్రభుత్వం వేసిన సకల పన్నులు ప్రజలకు పెనుభారంగా పరిణమించి వారి జీవితాల్లో గాడాంధకారం అలుముకొన్నది అని అభిప్రాయపడ్డారు. భాధ్యత లేని జగన్ రెడ్డి ఏలుబడిలో పెరుగుతున్నధరల ధాటికి, పన్నుల బాదుడుకు ప్రజల జీవితాలు ఆగమయ్యాయని అని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ రెడ్డికి జనం భాధలు పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ధరల మంటల్లో బడుగుల బతుకులు కాలిపోతున్నాయన్న ఆమె.. పది రోజుల వ్యవధిలోనే కాయకూరల రెట్టింపయ్యాయి. ఈ విధమైన ధరలు ఎప్పుడన్నా విన్నామా ? మొన్నటివరకూ రూ.100కు నాలుగైదు రోజులకు సరిపడా కాయగూరలు వచ్చేవని , కానీ ఇప్పుడు వందకు ఒక రకం కూడా కొనుగోలు చేసే పరిస్తితి లేదు అని ప్రజలు అంటున్నారన్నారు. అన్ని కాయకూరల ధరలు,ఆకు కూరల భగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్ లో బియ్యం, కందిపప్పు, పాలు వంటి అనేక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ సామాన్య, మధ్య తరగతి వంటింటి బడ్జెట్లను తల్లకిందులు చేశాయి.

10 రోజుల క్రితం వరకూ కిలో రూ.20 నుండి రూ.30 ఉన్న కాయకూరల ధరలు మూడు, నాలుగు రెట్లకుపైగా పెరిగాయి. 20 రోజుల క్రితం వరకు కిలో రూ.20 ఉన్న టమాటా ధర భారీగా పెరిగింది అని అన్నారు. రాష్ట్రంలో ఉల్లిపాయల ధర ఒక్కటే చౌకగా ఉందే తప్ప మిగిలిన రేట్లన్నీ ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. ఈ కూరగాయల ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతుండడం సామాన్యులను కలవరానికి గురిచేస్తోంది అని గౌతు శిరీష అన్నారు. పెరుగుతున్న ధరల పై ముఖ్యమంత్రి జగన్ ఏనాడూ సమీక్షించి ఎరుగరు.

ప్రజల దృష్టి మళ్లించి తన పాలనా వైపల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ఎప్పటి కప్పుడు కొత్త ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని మండిపడ్డారు. జనం కళ్ళకు గంతలు కట్టడం కోసమే ముఖ్యమంత్రి ఏదో చేస్తున్నట్లు కనపడాలి కాబట్టి కొయ్యగుర్రం పై కూర్చొని ఊగుతున్నాడు తప్ప రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందని ఎవరు అనుకోవడంలేదు అని చెప్పుకొచ్చారు. ఎంత సేపు రాజకీయ ఎత్తుగడలు తప్ప ప్రజల భాధలు, సమస్యలు పట్టడంలేదు జగన్ ప్రభుత్వానికి అని విమర్శించారు. సామాన్యులకు పెనుభారంగా పరిణమించిన ధరలను మానవత్యంతో వ్యవహరించి పన్నులు,ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలి. లేకుంటే ధరల మంటల్లో జగన్ ప్రభుత్వం కాలిపోవడం ఖాయం అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హెచ్చరించారు.

Advertisement

Next Story