ఆదరించండి.. అండగా ఉంటాం: Nara Lokesh

by srinivas |   ( Updated:2023-12-11 15:47:49.0  )
ఆదరించండి.. అండగా ఉంటాం: Nara Lokesh
X

దిశ, ఏపీ బ్యూరో: ‘రోడ్లకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. జగన్​ సర్కారు అధ్వాన పాలనకు ఇదే నిదర్శనం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త రహదారులు నిర్మించి ట్రాఫిక్​ సమస్యలను నివారిస్తాం’అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ హామీనిచ్చారు. లోకేష్​ యువగళం యాత్ర విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలోకి సాగింది. రైల్వే ట్రాక్​పై ఓవర్​ బ్రిడ్జి నిర్మించాలని ఇందిరా కాలనీ, రాజీవ్​ కాలనీ, దుర్గా కాలనీ, లింగాల కాలనీలకు చెందిన ప్రజలు విన్నవించారు.


పాయకరావు పేట ప్రజలు ట్రాఫిక్​ సమస్యలను లోకేష్​ దృష్టికి తీసుకొచ్చారు. జగన్​ అధికారానికి వచ్చాక స్థానిక సంస్థలకు నిధులు నిలిపేసి నిర్వీర్యం చేసిన ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు లోకేశ్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక డ్రైవ్​ చేపడతామన్నారు. నగరాలు, పట్టణాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగు పరుస్తామని హామీనిచ్చారు.


అచ్యుతాపురం సెజ్​లో పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి మత్స్యకారులతోపాటు వెంకటనగరం గ్రామ ప్రజలు ఇబ్బందులు పడ్తున్నట్లు లోకేష్​కు వినతి పత్రం సమర్పించారు. ఈ పరిశ్రమలు కాలుష్యాన్ని వదిలే పైపులైన్ల వల్ల ప్రజలు క్యాన్సర్​, గుండె, ఊపిరితుత్తుల జబ్బుల బారిన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్లో సంతానోత్పత్తి తగ్గిపోతుందని చెప్పారు. గ్రామస్తుల సమస్యలపై లోకేష్​ స్పందిస్తూ జగన్​ ముడుపులు దండుకొని ఇష్టారీతిన కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు ఆరోపించారు. టీడీపీ అధికారానికి వచ్చాక సముద్ర జలాలు కలుషితం కాకుండా తీరం వెంబడి ట్రీట్​ మెంటు ప్లాంట్లు నెలకొల్పుతామని భరోసానిచ్చారు. మత్స్యకారుల పిల్లలకు పరిశ్రమల్లో ఉద్యోగ​ అవకాశాలు కల్పిస్తామని లోకేష్​ హామీనిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed