మంచి నాయకుడిని కోల్పోయామంటూ.. అర్జునుడు పాడె మోసిన చంద్రబాబు

by Hamsa |
మంచి నాయకుడిని కోల్పోయామంటూ.. అర్జునుడు పాడె మోసిన చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బందరులో అర్జును అంత్యక్రియలలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఇతర నేతలు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు బచ్చుల అర్జును పాడె మోశారు. అంతకు ముందు బచ్చుల అర్జునుడు సతీమణి, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. నేనున్నాంటూ ధైర్యం చెప్పారు. బచ్చుల అర్జునుడి మృతి బాధాకరమని చంద్రబాబు అన్నారు. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవయవాలు దెబ్బతినడం వల్ల అర్జునుడుని బతికించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన అర్జునుడు అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగారని కొనియాడారు. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్‌గా ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని.. ఎమ్మెల్సీగా అమరావతితో పాటు వివిధ అంశాలపై గట్టిగా పోరాడారని చెప్పుకొచ్చారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గానూ తనదైన సేవలు అందించారన్నారు. గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించారని.. బచ్చుల అర్జునుడు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇకపోతే నెలరోజుల క్రితం హార్ట్ అటాక్‌కు గురయ్యారు బచ్చుల అర్జునుడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు స్టంట్ వేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed