- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'జయహో.. బీసీ మహాసభ'.. బ్యాక్‌బోన్ క్లాస్ మాతోనే : YSRCP
ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ రాజకీయ పార్టీలు బీసీలకు దగ్గరయ్యేందుకు యత్నిస్తుంటాయి. అప్పటి వరకు తాము కరివేపాకులా తీసిపడేసిన బీసీలపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తుంటాయి. వెనుకబడిన తరగతులను ఉద్ధరించడంలో తమకు సాటి ఎవరూ లేరని ఒట్టేసి మరీ చెబుతుంటాయి. పోలింగ్ పూర్తయ్యే వరకు వారి చెవుల్లో పూలు పెడుతూనే ఉంటాయి. పార్టీలు చెప్పే కబుర్లన్నీ నిజమే అయితే బీసీలు ఇంకా ఎందుకు వెనుకబడే ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎన్నికలు మళ్లీ సమీపిస్తుండడంతో వివిధ పార్టీలు మరోసారి బీసీల భజన ప్రారంభించాయి.
దిశ, ఏపీ బ్యూరో: పాలకపక్షం వైసీపీ గురువారం 'జయహో.. బీసీ మహాసభ' నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా బీసీలకు వైసీపీ సర్కారు ఏమేం చేసిందో చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా 24.61 లక్షల మంది బీసీ రైతులకు రైతు భరోసా కింద 12,113 కోట్లు అందించారు. 1.18 లక్షల మంది మత్స్యకారులకు భరోసా కింద రూ.410 కోట్లు ఇచ్చారు. నేతన్న నేస్తం కింద 71,980 మంది చేనేత కార్మికులకు రూ.703 కోట్లు అందజేశారు. వైఎస్సార్ చేయూత కింద 17.94 లక్షల మంది బీసీ మహిళలకు రూ. 9,026 కోట్లు ఇచ్చారు. అమ్మఒడి ద్వారా 19.67 లక్షల మంది బీసీలకు రూ.8,694 కోట్లు అందించారు. ఆరోగ్యశ్రీ కింద 12.35 లక్షల మంది బీసీలకు రూ.3,925 కోట్లు అందజేశారు.
ఇంకా జగనన్న చేదోడు కింద వడ్డీ లేని రుణాలు, సున్నా వడ్డీ కింద పంట రుణాలు ఇచ్చారు. మూడేళ్లలో ఇవన్నీ కలిపితే 1.63 లక్షల కోట్లు అందించి తాము బ్యాక్‌బోన్ క్లాస్‌కు వెన్నెముకగా నిలిచామని వైసీపీ సర్కారు బీసీ మహాసభలో వెల్లడించనుంది. మంత్రి వర్గంలో 70 శాతానికిపైగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సుమారు 700 మందికి పదవులు ఇచ్చినట్లు సగర్వంగా ప్రకటించనుంది. గత టీడీపీ ప్రభుత్వం కన్నా పదిరెట్లు బీసీలకు లబ్ది చేకూర్చినట్లు వైసీపీ చెబుతోంది. బీసీ గణన చేపట్టాలని పార్లమెంటులో చర్చ పెడతామంటున్నారు. ఉభయ సభలతోపాటు అసెంబ్లీ, జ్యూడీషియరీలో కూడా బీసీలకు రిజర్వేషన్కల్పించాలనే డిమాండుకు తాము మద్దతు ఇస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
దొందూ దొందే..
మరోవైపు వైసీపీ బీసీల ద్రోహి అని టీడీపీ విమర్శిస్తోంది. అసలు బీసీలకు రాజకీయ అధికారాన్ని ఇచ్చిందే తమ పార్టీ అని, ఎన్టీఆర్అందుకు ఆద్యుడని సగర్వంగా ప్రకటిస్తోంది. స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ను 27 శాతానికి కుదించిన పాపం వైసీపీదేనని దుమ్మెత్తిపోస్తోంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు అన్యాయం చేశారని ఆరోపిస్తోంది. దీనివల్ల సుమారు 16 వేల మంది స్థానిక ప్రజా ప్రతినిధులుగా బీసీలు అవకాశం కోల్పోయినట్లు చెబుతోంది. బీసీల్లో కేవలం ఐదారు కులాలకు మాత్రమే వైసీపీ సర్కారు నవరత్నాల ద్వారా లబ్ది చేకూరుస్తూ మిగతా కులాలను గాలికొదిలేసిందని కూడా టీడీపీ విమర్శిస్తోంది. ప్రజలందరికీ అమలు చేసే సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన బీసీలకు అంతిచ్చాం.. ఇంతిచ్చామని చెప్పడం దగా చేయడమేనని దుమ్మెత్తిపోస్తోంది. వివిధ చేతి వృత్తుల వారిని దారిద్య్రం నుంచి బయటపడేట్లు తాము స్వయం ఉపాధికి ఊతమిస్తే.. వైసీపీ కేవలం చిల్లర విదిల్చి అదే గొప్పగా చెప్పుకుంటున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందువల్ల బయటకెళ్లిన బీసీలంతా తిరిగి పుట్టినిల్లయిన టీడీపీకి తిరిగి రావాలని ఆ పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు.
జనసేన చెప్పేది నిజమేనా..
పెత్తందారీ వర్గాలు అన్ని రంగాల్లో బీసీలను అణగదొక్కుతున్నాయని జనసేన ఆరోపిస్తోంది. వైసీపీ, టీడీపీల్లో మాదిరిగా తమ పార్టీలో బీసీ సెల్లాంటిది పెట్టలేదని చెబుతోంది. కేవలం బీసీలను బీసీలకే పరిమితం చేసే పద్దతి జనసేనలో లేదంటున్నారు. అందుకే అన్ని కులాల ఐక్యతకు జనసేన పెద్దపీట వేస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ అనేక వేదికలపై ప్రకటించారు. అణగారిన వర్గాలకు నిజమైన రాజ్యాధికారం జనసేనతోనే సాధ్యమంటున్నారు. అందువల్ల బీసీలంతా జనసేనతో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు.
వీరు ఎందరున్నా పెత్తనం వారిదే..
ఇప్పటిదాకా ఏలిన పాలక ప్రభుత్వాలు బీసీలకు అంత చేశాం.. ఇంత చేశామని గొప్పలు పోతున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మొత్తం బీసీల్లో 30 శాతానికి మాత్రమే సాగు భూమి ఉంది. ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన భూమిపై హక్కు మిగతా వాళ్లకు ఎందుకు లేదు ? మొత్తం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో బీసీలు నామమాత్రమే. జడ్జిల్లో ఎక్కడో ఒకరు తప్ప అసలు కనిపించరు. ప్రస్తుత ప్రైవేటు విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో బీసీలకు చెందినవి ఎన్ని ఉన్నాయి ? డాక్టర్లు, ఇంజనీర్లలో ఎంత మంది బీసీలు ఉన్నారు ? మీడియా రంగంలో ఎంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు? 139 కులాల వారు జనాభాలో సగం దాకా ఉంటే ఎంత మంది చట్టసభలకు వెళ్లగలుగుతున్నారు? కొద్దిమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా ఎవరు పెత్తనం చేస్తున్నారు ? ఇవన్నీ జగమెరిగిన సత్యమే. అందుకే బీసీల్లో పెరుగుతున్న అసహనాన్ని ఏదో రూపంలో తమవైపు మళ్లించుకునేందుకు ప్రధాన పక్షాలు ఆకర్షణీయ నినాదాలు ఇస్తున్నాయి. ఈసారి ఎన్నికల నాటికి ఏ పార్టీ వైపు ఎందరుంటారోనని అన్ని ప్రధాన పార్టీల్లో గుబులు నెలకొంది.