40 ఏళ్ల టీడీపీ.. నేడు ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

by Rajesh |
40 ఏళ్ల టీడీపీ.. నేడు ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
X

దిశ, ఏపీ బ్యూరో: యుగ పురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నవ వసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో దివంగత ఎన్టీఆర్ 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నాడు పార్టీని ప్రకటించారు. 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అంటూ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలకు రెడీ అయ్యింది. చంద్రబాబు నేడు పార్టీ ప్రకటించిన ప్రాంతంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే.. అటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్ వేడుకల్లో చంద్రబాబు

మంగళవారం ఉదయం దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణం వద్ద చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి ఆవిర్భావ వేడుకల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత 5.45గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో జరిగే ఆవిర్భావ వేడుకల సభలో చంద్రబాబుతో పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర నేతలు పాల్గొంటారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ 40 వసంతాల వేడుకల్లో ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకూ జరిగే బైక్ ర్యాలీలో లోకేశ్ పాల్గొంటారు. అనంతరం 5 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే బహిరంగ సభలో లోకేశ్ పాల్గొంటారు.

Next Story

Most Viewed