‘కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి’.. సుప్రీం కోర్టు సెన్సేషనల్ కామెంట్స్

by karthikeya |
‘కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి’.. సుప్రీం కోర్టు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ (Adultration of Laddu Prasad) వివాదంపై రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి (Subrahmanya swamy) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా.. సుబ్రహ్మణ్యస్వామి తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం పలు కీలక ప్రశ్నలను సంధించింది. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్‌ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ సీఎం (AP CM Chandrababu Naidu) చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండడం ఏంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ కోసం సిట్‌ని ఏర్పాటు చేసిన తరువాత కూడా సీఎం మీడియా ముందు ప్రకటనలు ఎందుకు చేశారని నిలదీసింది.

‘‘ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు (Quality Tests) పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోంది. అయితే కల్తీ జరిగిందని చెబుతున్న శాంపిళ్లను ఎక్కడ నుంచి సేకరించారు..? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి సేకరించారా..? నెయ్యి కల్తీ జరిగినట్లైనా ఆధారాలు చూపించండి. అసలు కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్టు ఎలా తెలిసింది? నెయ్యిని ల్యాబ్‌కి ఎప్పుడు టెస్ట్‌లకు పంపారు? అన్నింటికంటే ముఖ్యంగా తయారైన లడ్డూలను టెస్టింగ్‌ (Testing)కి పంపారా..? లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా..?’’ అని సూటిగా ప్రశ్నించింది. అంతేకాకుండా ఈ కేసులో రాజకీయ జోక్యం (Political Interfearance)పై కూడా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. అనంతరం సిట్ దర్యాప్తుపై కూడా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిట్ సరిగ్గా విచారణ జరపగలదో లేదోఅనే అనుమానాలున్నాయని, కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపితే బావుంటుందనే అభిప్రాయాన్ని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. చివరిగా తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed