అమరావతి నిర్మాణాలపై ఐఐటీల అధ్యయనం..

by Anjali |
అమరావతి నిర్మాణాలపై ఐఐటీల అధ్యయనం..
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి పునర్నిర్మాణంపై అత్యంత పకడ్బందీగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఐదేళ్లలో అమరావతికి ఎలాంటి నష్టం జరిగిందనేది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో విడుదల చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు ప్రారంభమైన చాలా భవనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే ఐదేళ్ళపాటు ఆయా భవనాలను పట్టించుకోకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అమరావతిలో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించే ముందు.. అసలు ఎంత నష్టం జరిగిందనే దానిపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించింది. అమరావతిలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన కట్టడాల పటిష్టతపై ముందుగా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది. దీనికోసం ఐఐటీ నిపుణుల చేత కట్టడాల పటిష్ఠతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్‌కు బాధ్యతలు..

గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలను ఐఐటీ ఇంజినీర్ల చేత సర్కారు అధ్యయనం చేయించనుంది. ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్దారణ కోసం ఐఐటీ చెన్నై‌కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ల పటిష్టత నిర్దారణ కోసం ఐఐటీ హైదరాబాద్‌కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఐఐటీల నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకెళ్తామని అన్నారు. అమరావతిలో నిర్మాణాల కోసం గతంలో 47 మంది కన్సల్టెంట్స్‌ను నియమించగా వారంతా గత ప్రభుత్వంలో తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ కన్సల్టెంట్ల నియామకం కోసం టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. సీఆర్డీయేలో గతంలో ఉన్న సిబ్బంది కంటే ప్రస్తుతం 528 మంది తక్కువగా ఉన్నారన్నారు. సిబ్బంది కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమరావతికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా సీఎం అధ్యక్షతన తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed