Udayagiri: వైసీపీ ఇంచార్జ్ పదవిపై మెట్టుకూరు గురి!

by srinivas |   ( Updated:2023-03-25 16:55:12.0  )
Udayagiri: వైసీపీ ఇంచార్జ్ పదవిపై మెట్టుకూరు గురి!
X
  • మాజీ మంత్రి ఆనం ప్రధాన అనుచరుడిగా ఆయనకు గుర్తింపు
  • ఆనం ఆయనకు రాజకీయ గురువు
  • వైసిపి అధిష్టానం పరిశీలనలో మెట్టుకూరు పేరు

దిశ, నెల్లూరు సిటీ: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక అధికార పార్టీ వైసీపీలో చిచ్చు రగిలించింది. ఎన్నికలవేళ రగిలిన చిచ్చు నెల్లూరు జిల్లాను కూడా తాకింది. నెల్లూరు జిల్లాలోనే ముఖ్యంగా సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే మేకపాటి సోదరుల్లో ఒకరైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై వైసీపీ హై కమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే సస్పెన్షన్ వేటుకు చంద్రశేఖర్ రెడ్డి బెదరలేదు. తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇచార్జ్ నియామకం అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది. నిన్న, మొన్నటి వరకు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఎంపీ ఆదాల, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వైసీపీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు జరుపుతున్నారు. వ్యవహారం కొలిక్కి వచ్చిందనుకునే సమయంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్,‌ మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి పేరు ఉదయగిరి ఇంచార్జిగా పరిశీలనలోకి వచ్చినట్లు తెలిసింది.

మెట్టుకూరుకు రాజకీయ గురువు ఆనం

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతున్న సమయంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆనం ఆశీస్సులతో నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆనం ఎక్కడుంటే మెట్టుకూరు కూడా అక్కడే ఉండేవారు. పార్టీ ఏదైనా ఆనం వెంట ఉంటూ తన ప్రయాణం సాగించారు. గత ఎన్నికల సమయంలో ఆనం వైసీపీలో చేరడంతో మెట్టుకూరు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనం వెంట అడుగులు వేస్తూ రాజకీయాల్లో కొంత ఎత్తుకు ఎదిగారు. ఆయనను వైసీపీ అధిష్టానం ఉదయగిరి నియోజకవర్గం పరిశీలకుడిగా నియమించింది.

అయితే పరిశీలకుడు మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఎక్కడ కూడా ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన దాఖలాలు లేవు. అంతేగాక ఉదయగిరి ఎమ్మెల్యే అసమ్మతి రాగాన్ని ఆలపిస్తూ ఉన్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అసమ్మతి రాగం కనిపెట్టడంలో పరిశీలకుడుగా వచ్చిన మెట్టుకూరు ధనుంజయరెడ్డి పూర్తిగా విఫలం కావడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ పరువు పోగొట్టుకోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డి తనను ఇంచార్జిగా నియమించాలంటూ అధిష్టానం వద్దకు పైరవీలు నడపడం విశేషం. పార్టీ పరువు పోగొట్టుకోవడానికి పరోక్షంగా కారణమైన మెట్టుకూరు ధనుంజయ రెడ్డిని ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జిగా నియమిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story