కోటంరెడ్డి... కోవర్టా? కాదా..??

by S Gopi |   ( Updated:2023-02-04 11:17:54.0  )
కోటంరెడ్డి... కోవర్టా? కాదా..??
X

"వైసీపీ కోవర్టు డ్రామా స్టార్ట్​ అయినట్లుంది. ఇది రాబోయే వ్యూహానికి సినిమా స్క్రిప్ట్​ అనుకుంటా. జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు !" అంటూ టీడీపీ సీనియర్​ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్​చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలం గురించే ఆయన ట్వీట్ ​చేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ అవకాశమిస్తే పోటీ చేస్తానని నెల్లూరు రూరల్ ​ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి వ్యాఖ్యానించడంపై బుచ్చయ్య చౌదరి ఇలా ట్విట్టర్​ వేదికగా స్పందించినట్లు టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీలో అసమ్మతి నేతలు పచ్చ కండువా వేసుకోవడానికి సిద్దమైతే టీడీపీ ఆహ్వానిస్తుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. వలస వచ్చిన నేతలతో ఎవరి సీటు గల్లంతు అవుతుందోనన్న ఆందోళన నెలకొంది. బుచ్చయ్య చౌదరి భావిస్తున్నట్లు ఇది నిజంగా వైసీపీ కోవర్టు రాజకీయమా అని కూడా టీడీపీ శ్రేణులు ఆలోచనలోపడ్డాయి.

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో సుమారు 40 నుంచి 50 సీట్లలో టీడీపీ బలహీనంగా ఉన్నట్లు చంద్రబాబు స్వయంగా చేయించుకున్న సర్వేలో గుర్తించినట్లు పార్టీ వర్గాలకు తెలుసు. ఆయా సీట్లలో బలమైన అభ్యర్థి దొరికితే ఇన్​చార్జులను మార్చివేయడానికి చంద్రబాబు వెనుకాడరు. బలహీనమైన స్థానాల పరిధిలో వైసీపీ నుంచి వచ్చే నేత ధీటైన అభ్యర్థి అనుకుంటే పచ్చ కండువా కప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఒక్క సీటును కూడా టీడీపీ గెలుచుకోలేదు. ఇప్పుడు నెల్లూరు రూరల్​ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ అవకాశమిస్తే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ముందస్తుగా చంద్రబాబుతో కోటంరెడ్డి మాట్లాడుకునే పార్టీపై ఫోన్​ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బుచ్చయ్య చౌదరి ట్వీట్ తో...

ఒకవేళ చంద్రబాబుతో సీటు గురించి సంప్రదించకుండా అలా వ్యాఖ్యానించి ఉంటే టీడీపీ వర్గాలు స్పందించాలి. స్వాగతించడమో లేక తమతో సంప్రదించలేదనో చెప్పాలి. మౌనం దేనికి సంకేతమో తెలీదు. ఈలోగా బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ దెబ్బకు టీడీపీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఇక ఆనం రామనారాయణ రెడ్డి కూతురు టీడీపీ మహానాడులోనే నారా లోకేశ్​తో సంప్రదించి బెర్త్ ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామనారాయణ రెడ్డి టిక్కెట్ అడిగితే టీడీపీ కాదనకపోవచ్చు. ఈసారి ఎలాగైనా నెల్లూరు జిల్లాలో సగం సీట్లు గెలవాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ఇలాంటి తరుణంలో అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారా! లేక బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చిన అనుమానంతో వెనకడుగు వేస్తారా అనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

వారికి ఆశాభంగమే...

కేవలం నెల్లూరు జిల్లానే కాదు. తాము బలహీనంగా ఉన్నచోట్ల బలమైన అభ్యర్థుల కోసం టీడీపీ వెతుకుతోంది. గత ఎన్నికల్లో తమకన్నా పది శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్న వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి దొరికితే పార్టీలోకి తీసుకోవచ్చు. అక్కడ నుంచి చంద్రబాబుకు మరో తలనొప్పి ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటిదాకా పార్టీని నమ్ముకుని తనదే సీటు అనే భావనతో పనిచేస్తున్న వాళ్లకు ఆశాభంగం తప్పదు. వాళ్లను నయానో భయానో బుజ్జగించాల్సి వస్తుంది. వైసీపీ నుంచి వచ్చిన నాయకుడితో పనిచేయాల్సి వచ్చినప్పుడు క్యాడర్​సహకరిస్తుందా లేదా అనేది కూడా పెద్ద సమస్యే. బుచ్చయ్య చౌదరే కాదు. ఎవరేమన్నా అవసరమైన చోట వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి దొరికితే చంద్రబాబు వదులుకోరని పార్టీలో కొందరు నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లానే. ఇంకా రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ అసమ్మతి నేతలకు చంద్రబాబు గ్రీన్​సిగ్నల్​ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వరుస పరిణామాలపై ఇప్పటిదాకా చంద్రబాబు స్పందించకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనేది తమ్ముళ్లల్లో చర్చనీయాంశమైంది.

READ MORE

నన్ను బెదిరిస్తే.. మీకు వీడియో కాల్స్ వస్తాయ్: MLA కోటంరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement

Next Story

Most Viewed