నెక్స్ట్ జగన్ వ్యూహం ఇదేనా....?

by S Gopi |   ( Updated:2023-02-09 17:44:47.0  )
నెక్స్ట్ జగన్ వ్యూహం ఇదేనా....?
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ ఫొటో​ఉన్న స్టిక్కర్లను ఇళ్లకు అంటించే కార్యక్రమాన్ని ఈనెల 11 నుంచి చేపట్టనున్నారు. ప్రతి ఇంటి యజమాని అనుమతి తీసుకొని స్టిక్కర్​వేయాలని పార్టీ అధిష్టానం నిర్దేశించింది. అందుకోసం వలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించింది. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికీ ఏదో ఒక లబ్ది చేకూరింది. తెలుగు దేశం పార్టీ సానుభూతిపరుల కుటుంబాలు స్టిక్కర్​ వేయడానికి అనుమతించకపోవచ్చు. ఈ పాటికే వివిధ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులుగా ఉన్నవాళ్లు స్టిక్కర్లను నిరాకరిస్తే పథకాలు కట్ చేస్తారనే అభద్రతాభావం వల్ల కాదనలేకపోవచ్చు. దీంతో వైసీపీ సానుభూతిపరులతోపాటు తటస్థంగా ఉండేవాళ్లు అడ్డు చెప్పలేకపోవచ్చు. స్టిక్కర్లు పడిన ప్రతి ఇల్లూ వైసీపీకి సానుకూలమనే సంకేతాలు ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బదీసేందుకు ఇది దోహదపడుతుంది.

జగన్ వ్యూహం ఇదేనా....

సీఎం జగన్​కేవలం ప్రజల నాడి తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్ని సర్వేలు ఎన్ని నివేదికలు ఎలా ఉన్నా దాదాపు నాలుగేళ్ల నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను మళ్లీ ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. వైసీపీ మీద, ఇప్పటిదాకా పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉంటే స్టిక్కర్లు అంటించడానికి అంగీకరిస్తారని లేకుంటే నిరాకరిస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇది కేవలం పైకి చెప్పడానికే తప్ప వాస్తవం అందుకు భిన్నంగా ఉందని విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. వలంటీర్లను అడ్డుపెట్టుకొని స్టిక్కర్ వేయనీయకుంటే పథకాలు కట్ చేస్తారనే అభద్రతా భావానికి గురి చేస్తూ అన్ని ఇళ్లకూ స్టిక్కర్లు వేస్తారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

సోషల్ మీడియాలో రచ్చరచ్చ...

వైసీపీ చేపడుతున్న ఈ క్యాంపెయిన్​పై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ రగులుతోంది. ప్రభుత్వ పాలనపై అధికార పార్టీ ఇలా రెఫరెండం కోరడంలో తప్పేముందని కొందరు వాదిస్తున్నారు. వలంటీర్లను ముందుపెట్టి క్యాంపెయిన్​చేయడమంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం అవుతుంది. సొంత పార్టీ కార్యక్రమం ఎలా అవుతుందని విపక్షాలకు చెందిన సోషల్​మీడియా కార్యకర్తలు దుమ్మెత్తి పోస్తున్నారు. నాడు చంద్రబాబు లబ్దిదారులకు ఇచ్చిన వాహనాలపై 'థ్యాంక్యూ సీఎం సర్' రాయించుకోలేదా? వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులతో ఇలాగే ప్లకార్డులు చేతపట్టించి ప్రచారం చేయించుకోలేదా అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎదురు దాడికి దిగుతున్నారు. ఇరు పార్టీల పరిస్థితులు చూస్తుంటే ఈ జగడం న్యాయ స్థానాల దాకా చేరేట్లుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి : వేదవతికీ గుండె కోత

Advertisement

Next Story

Most Viewed