- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జాతీయ రహదారి నిర్మాణం ఈ సర్వేయర్ జీవితాన్ని మలుపు తిప్పింది!
జిల్లాలో సర్వేయర్లు భూమాయకు తెరతీశారు. కర్నూలు-అమరావతి, కల్వకుర్తి-నంద్యాల 167కే జాతీయ రహదారుల సర్వే పనుల ముసుగులో లక్షలు దండుకుంటున్నారు. వీరి అక్రమ దందా వెనుక అధికార పార్టీ నేతలు, రెవెన్యూ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎకరా సర్వే చేస్తే రూ.1500 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. పొలాలు సర్వే చేసే క్రమంలో మిగులు భూములుంటే ఎకరాకు లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుంటూ అనుభవ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. దీంతో రైతులు మళ్లీ వీఆర్ఓలతో సంప్రదింపులు చేసుకుని వారికి మరో లక్ష ముట్టజెబుతున్నారు.
దిశ, కర్నూలు ప్రతినిధి: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల సర్వేయర్ గా పని చేస్తున్న రాజశేఖర్ సొంత ప్రాంతం వైజాగ్. ఈయన ఇక్కడ ఆరేళ్ల నుంచి సర్వేయర్ గా పని చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారమెత్తారు. నాలుగు నెలల్లోనే రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులను కలుపుతూ కృష్ణానదిపై దేశంలోనే మొదటి తీగల వంతెన నిర్మాణంతోపాటు కల్వకుర్తి-నంద్యాల మీదుగా తిరుపతికి 167కే జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి సంబంధించి సర్వే పనులు కూడా పూర్తి చేశారు.
నాయకులతో జతకట్టి
జాతీయ రహదారి నిర్మాణం ఈ సర్వేయర్ జీవితాన్ని మలుపు తిప్పింది. సిద్దేశ్వరం గ్రామం నుంచి పాతమాడుగుల, ఎర్రమఠం, ముసలిమడుగు, శివపురం, లింగాపురం, కొత్తమాడుగుల, దుద్యాల గ్రామాల మీదుగా 167కే జాతీయ రహదారి వెళుతోంది. దీంతో సర్వేయర్ అనుమానం రాకుండా పేరున్న అధికార పార్టీకి చెందిన నలుగురు ప్రధాన నాయకులతో జత కట్టారు. ప్రధాన రహదారికి సమీపంలో సమస్యాత్మకంగా ఉన్న పొలాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీరికి వీఆర్వోలు, తహసీల్దార్ సహకరించడంతోనే వీరి దందా సజావుగా సాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.
అంతా మిగులే..
అందులో భాగంగానే శివపురం గ్రామంలో బీజేపీ నాయకుడైన శంకర్ గౌడ్ కు చెందిన 3 ఎకరాల భూమిని రూ.20 లక్షల కారు చౌకగా కొనుగోలు చేసి ఆ పొలాలను రూ.55 లక్షలకు విక్రయించారు. దుద్యాల గ్రామంలో సర్వే నెంబర్ 914, 915, 916 లో దాదాపు 7 నుంచి 8 ఎకరాల భూమి ఉంది. అందులో 4 ఎకరాల మిగులు భూమి ఉంది. ఈ భూమిని జూపాడు బంగ్లాకు చెందిన జంగాల పెద్దన్న బంధువులు కొనుగోలు చేశారు. అందులో మిగులు భూమికి అనుభవంలో ఉన్నట్లు పత్రాలు ఇచ్చేందుకు రూ.8 లక్షలు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటికి ఎంజాయ్ మెంట్ పత్రం ఇవ్వడంతో ఆ రైతులు రూ.8 లక్షలు ఇవ్వగా అందులో రూ.4 లక్షలు సర్వేయర్, మిగిలిన రూ.4 లక్షలు మధ్యవర్తులైన అధికార పార్టీ నేతలు పంచుకున్నట్లు సమాచారం. దుద్యాల గ్రామానికి చెందిన ఓ మైనార్టీ మహిళ పొలాన్ని ఇతరులకు విక్రయించింది. ఆమె పొలం పక్కన దాదాపు మూడున్నర ఎకరాల మిగులు భూమిని అనుభవంలో ఉన్నట్లు పత్రాలిచ్చేందుకు, వారికి ఈ భూమిని రిజిస్టర్, ఆన్ లైన్ చేసేందుకు దాదాపు రూ.10 లక్షలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ తంతు కూడా పూర్తైనట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఆత్మకూరులో రూ.30 లక్షల విలువ చేసే 10 సెంట్ల స్థలం కూడా కొనుగోలు చేశారు. అలాగే లింగాపురం, గువ్వలకుంట, జీ వీరాపురం గ్రామాల్లో దాదాపు 8 ఎకరాలు కొనుగోలు చేశారని, వాటిని అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నెల రోజుల్లో ఈయనకు పదోన్నతి కూడా ఉండడంతో అధిక మొత్తంలో సంపాదించుకుని వెళ్లాలనే యోచనతో ఉన్న ఇలాంటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సర్వేయర్ వ్యవహరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్ చేయలేదు: రాజశేఖర్, మండల సర్వేయర్, కొత్తపల్లి
నేను రియల్ ఎస్టేట్ చేయడం లేదు. నా భార్య కమ్మలు, చైన్ అమ్మి శివపురం గ్రామంలో పొలం కొనుగోలు చేశాను. ఆ తర్వాత ఈ పొలాలకు సమీపంలో జాతీయ రహదారి వెళ్లడంతో బాగా ధర వచ్చింది. అందుకే పొలం విక్రయించాను. ప్రభుత్వ నిబంధనల మేరకు నేను పనులు చేస్తున్నాను. కావాలని చాలామంది నాపై నిందలు మోపుతున్నారు.
మా దృష్టికి రాలేదు: ఉమాపతి, డివిజనల్ సర్వే అధికారి, ఆత్మకూరు
కొత్తపల్లి మండల సర్వేయర్ ఆ మండలంలో వారి నాన్న హయాంలో 4 ఎకరాలు కొనుగోలు చేసిన మాట వాస్తవమే. అయితే ఇతను అధికార పార్టీ నేతలతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తమ దృష్టకి రాలేదు. ఈ విషయంపై విచారణ చేపడతాం.
ప్రభుత్వ భూముల సంరక్షణకు చర్యలు: మిరియాల దాసు, ఆర్డీవో, ఆత్మకూరు
గ్రామ రెవెన్యూ అధికారులు ఒకే పొలాన్ని ముగ్గురు, నలుగురి పేరుపై రిజిస్టర్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. సర్వేయర్ వ్యవహారం మా దృష్టికి రాలేదు. వీటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.