AP News:జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

by Jakkula Mamatha |
AP News:జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్ ) నర్సీపట్నం శాఖ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా చేయించారు. శుక్రవారం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రమాద బీమా బాండ్లను జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. జాప్ యూనియన్ సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా చేయించడం ద్వారా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఎవరికీ ప్రమాదం జరగకూడదని కోరుకుంటామని, అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కుటుంబానికి ప్రమాద బీమా ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. ఎంత అభివృద్ధి జరిగినా ఒకరిద్దరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదంలో మరణించిన ఆ వ్యక్తి కుటుంబానికి ప్రమాద బీమా ఆదరణ ఇస్తుందన్నారు.

ప్రస్తుత కాలంలో ఆసుపత్రికి వెళితే లక్షల్లో బిల్లులు వేస్తున్నారని, ఇటువంటి ఇన్సూరెన్స్ ల ద్వారా బాధితుడికి ఎంతో కొంత తోడ్పాటు కలుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టిన జాప్ యూనియన్ కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో జనవరి 1న న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ రద్దు చేసుకున్నానని, సంతాప దినాలు ముగిసినందున జర్నలిస్టులకు ఆయన ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ రాష్ట్రంలోని 14 వేల పంచాయతీలలో జరిపించాలని అన్నారు. తెలుగువారి పండుగ అయిన ఉగాది ప్రాముఖ్యత అనేకమంది తెలుగు ప్రజలు మర్చిపోతున్నారని, ఈ కారణంగా ప్రస్తుత సమాజంలో బాలల ఉగాది పండుగ అంటే ఏమిటి? అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఉగాది సంబరాలు, పంచాంగ శ్రవణం జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

Advertisement

Next Story