నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేషహోమం

by Seetharam |
నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేషహోమం
X

దిశ, డైనమిక్ బ్యూరో : హిందూ సనాతన ధర్మప్ర‌చారంలో భాగంగా అలిపిరిలోని సప్త గోప్ర‌ద‌క్షిణ‌ మందిరంలో నవంబరు 23వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేషహోమం ప్రారంభ‌మ‌వుతుంద‌ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్దగ‌ల స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం వేదిక‌ను టీటీడీ ఈవో అధికారుల‌తో క‌లిసి గురువారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సామాన్య భ‌క్తులు హోమం, యాగం నిర్వ‌హించ‌డం చాలా ఖ‌ర్చుతో కూడుకున్నదని అన్నారు. కాబట్టి భ‌క్తుల‌ కోరిక మేర‌కు శ్రీవారి పాదాల వ‌ద్ద‌ త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్ర‌హం కోసం సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్లడించారు. ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్వ‌ర్యంలో అనునిత్యం ఈ హోమం నిర్వ‌హించ‌నున్న‌ట్లు, త్వ‌ర‌లో శాశ్వ‌త హోమ వేదిక‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ఈ విశేషహోమంలో పాల్గొనే గృహ‌స్తులకు (ఇద్ద‌రు) టికెట్ ధర రూ.1000గా నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్ర‌తి రోజు 50 టికెట్లు ఆన్‌లైన్‌లో, 50 టికెట్లు ఆఫ్‌లైన్‌లో, వ‌ర్చువ‌ల్ టికెట్లు ఎంత మందైన కోనుగోలు చేసి పాల్గొనవ‌చ్చ‌ని ఈవో ఏవీ ధర్మారెడ్డి వివ‌రించారు. ఈవో వెంట జేఈవోలు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, సిఇ నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ సిఎఫ్ శ్రీనివాస్, ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, డెప్యూటీ ఈవో శాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed