వైసీపీకి షాక్: జనసేనలోకి కీలక నేత.. అక్కడి నుంచే పోటీ

by Seetharam |
వైసీపీకి షాక్: జనసేనలోకి కీలక నేత.. అక్కడి నుంచే పోటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతుంది. పొత్తులు...ఎత్తులు..అభ్యర్ధుల లెక్కల్లో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ, జనసేన పొత్తు ఇప్పటికే ఖాయంగా కాగా బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరు పోటీ చేస్తారు.. ఎవరికి ఈసారి టికెట్ కోల్పోవాల్సి వస్తుంది అనేదానిపై చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. విజయవాడ తూర్పుపై జనసేన కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు అత్యధికంగా ఉండటంతోపాటు జనసేన సానుభూతిపరులు అత్యధికంగా ఉండటంతో జనసేన ఈసీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత యలమంచిలి రవి జనసేనలోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న యలమంచిలి రవి పార్టీ వీడేందుకు రెడీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో దేవినేని అవినాశ్ పోటీ చేస్తారని వైసీపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే యలమంచిలి రవి అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే అభిమానులు,కార్యకర్తలు జనసేన చేరాలని సూచించడంతో అయిన త్వరలోనే జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఎన్నికల సమయానికి యలమంచిలి రవి జనసేనలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.


జనసేనలోకి రవి?

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో విజయవాడ నగర పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ ఉన్నారు. అయితే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన యలమంచిలి రవి జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నాయకులు, కార్యకర్తలు యలమంచిలి రవికి టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన కాపు సామాజిక వర్గం యలమంచిలి రవికి అండగా ఉంటున్న నేపథ్యంలో రవి జనసేనలోకి వస్తే గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ యలమంచిలి రవికి టికెట్ ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను సైతం రెడీ చేసినట్లు తెలుస్తోంది. గద్దే రామ్మోహన్ స్థానంలో తూర్పు సీటు జనసేనకు కేటాయిస్తే టీడీపీ కీలకంగా భావిస్తున్న గన్నవరం నుంచి ఆయన సతీమణి గద్దే అనురాధను బరిలోకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది.


అవినాశ్ రాకతో మారిన లెక్కలు

2019 ఎన్నికల అనంతరం యలమంచిలి రవి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే గుడివాడ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగాపోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాశ్ వైసీపీలో చేరారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి వరకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన యలమంచిలి రవిని వైసీపీ అధిష్టానం తొలగించింది. పార్టీ ఇన్‌చార్జిగా దేవినేని అవినాశ్‌ను ప్రకటించింది. అంతేకాదు వైసీపీ నాయకత్వం సైతం వచ్చే ఎన్నికల్లో దేవినేని అవినాశ్ పోటీ చేస్తారని ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి దేవినేని అవినాశ్ తన పట్టు నిలుపుకునేందుకు శ్రమిస్తున్నారు. కృష్ణలంక,రాణి గారి తోట, గుణదలలో కలియతిరుగుతున్నారు. ఇకపోతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీకి అండగా నిలిచే ప్రధాన సామాజిక వర్గం లో గద్దే రామ్మోహన్ పైన వ్యతిరేకతతో ఉన్నట్లు తెలియడంతో వారిని తన వైపు తిప్పుకొనేందుకు అవినాశ్ ప్రయత్నిస్తున్నారు.

రాజకీయ నేపథ్యం

ఇకపోతే యలమంచిలి రవి 2009లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.అయితే 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. విజయవాడ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డారు. విజయవాడ తూర్పు టికెట్‌ను గద్దే రామ్మోహన్‌కు కేటాయించడంతో అలకబూనారు. టికెట్ ఇవ్వలేకపోయినా భవిష్యత్‌లో సుముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయినప్పటికీ అలకపాన్పువీడలేదు. అంతే టీడీపీ అధిష్టానం తీరును నిరసిస్తూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరారు. అక్కడ కూడా విజయవాడ తూర్పు టికెట్ ఆశించారు. అయితే ఐప్యాక్ టీం సర్వే ఆధారంగా ఆ స్థానాన్ని బొప్పన భవ్ కుమార్‌కు కేటాయించారు. దీంతో రవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


కలిసిరానున్న క్లీన్ ఇమేజ్

ఇదిలా ఉంటే విజయవాడ నగర రాజకీయాలలో యలమంచిలి రవి కుటుంబానికి ఉన్న క్లీన్ ఇమేజ్ ఉంది. యలమంచిలి రవి తండ్రి యలమంచిలి నాగేశ్వరరావు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి అందరి మన్నలను పొందారు. ఆ తర్వాత యలమంచిలి రవి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న యలమంచిలి రవి విజయవాడ తూర్పు నుంచి అభ్యర్థిగా దాదాపు ఖరారు అయ్యారు. అయితే చివరి నిమిషంలో సీటు విషయంలో మార్పు జరిగింది. యలమంచిలి రవిని తప్పించి బొప్పన భవ్ కుమార్‌‌కు టికెట్ కేటాయించారు. దీంతో 2019 ఎన్నికలో యలమంచిలి రవి అభిమానులందరూ జనసేనకు మద్దతు ప్రకటించారు. అప్పటి అభ్యర్థి బత్తిన రాముకు ఓట్లు వేశారు. దీంతో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed