బలబలాలను బట్టే అభ్యర్థుల ఎంపిక... 151 ఇన్‌చార్జిలు మార్చినా వైసీపీ గెలవదు: చంద్రబాబు నాయుడు

by Seetharam |   ( Updated:2023-12-14 11:35:01.0  )
బలబలాలను బట్టే అభ్యర్థుల ఎంపిక... 151 ఇన్‌చార్జిలు మార్చినా వైసీపీ గెలవదు: చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కలవరం మెుదలైంది. నియోజకవర్గాల ఇన్‌చార్జిల మార్పుల నేపథ్యంలో పార్టీకి చెందిన కీలక నేతలు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పిల్లిమెుగ్గలు వేసినా వచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 151 మందిని మార్చినా 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఇటీవలే సీఎం వైఎస్ జగన్ 11 నియోజకవర్గాలలో ఇన్‌చార్జిలను మార్చినట్లు తెలిసిందని...మిగిలిన నియోజకవర్గాల మెుత్తం ఇన్‌చార్జిలు మార్చినా తమకు ఏం కాదని చెప్పుకొచ్చారు. వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు ఎప్పుడో సన్నద్ధమయ్యారని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

వారంతా చెల్లని కాసులు

మరోవైపు ఒక నియోజకవర్గం ఇన్‌చార్జిని మరో నియోజకవర్గానికి మార్చిన అంశంపైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నియోజకవర్గంలో చెల్లని కాసులు.. మరో చోట చెల్లుతాయా అని ప్రశ్నించారు. మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని, ఆదిమూలపు సురేశ్‌లను సీఎం వైఎస్ జగన్ వేరే నియోజకవర్గాలకు మార్చారు. అలాగే మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితను సైతం తాడికొండ నియోజకవర్గానికి మార్చారు. దీంతో వీరిపై పరోక్షంగా చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని.. తిరుగుబాటు మొదలుకావడంతో సీఎం జగన్ మార్పులకు తెరతీశారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పుకొచ్చారు. అందువల్లే ఐదుగురు దళిత ప్రజాప్రతినిధులను వేరే నియోజకవర్గాలకు మార్చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నా బీసీ, నాబీసీ అని పదేపదే చెప్పుకునే సీఎం వైఎస్ జగన్ నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సామాజిక సాధికార బస్సుయాత్రలో తిరుగుతున్న బీసీ నేతలు ఎవరైనా పులివెందుల టికెట్ బీసీలకు కేటాయించాలని అడిగే దమ్ము ఉందా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు.

బలబలాలను బట్టే అభ్యర్థుల ఎంపిక

వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు పొత్తులో భాగంగా ఇరువురుం చర్చించి గెలుస్తారు అన్న అభ్యర్థులనే బరిలోకి దించనున్నట్లు వెల్లడించారు.బలా బలాలను బట్టే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, కుప్పంలోనూ ప్రజాభిప్రాయం సేకరిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

జగన్‌ది కక్షసాధింపు ధోరణి

ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను నిర్మించాను కాబట్టే జగన్ నీటిని విడుదల చేయలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో విధిలేని పరిస్థితుల్లో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అప్పటికే రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మిచౌంగ్ తుఫాన్‌ వల్ల రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని అన్నారు. తుఫాన్ హెచ్చరికలను సైతం ఈ ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని దాని ఫలితంగా 15 జిల్లాలలో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. తుఫాను హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని ఉంటే పంటనష్టం, ఆసతి నష్టాన్ని తగ్గించునేవాళ్లమన్నారు. అంతేకాదు ప్రాజెక్టుల మెయింటినెన్స్ పట్టించుకోవడం లేదని..అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకెళ్లిపోవడానికి అదే ఒక కారణమన్నారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు సైతంకొట్టుకుపోయాయని ఆరోపించారు. రిపేర్లు చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొందని... పంట కాల్వల నిర్వహణ సరిగా చేయడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి గానీ మంత్రులు కానీ కనీస చర్యలు తీసుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story