సమ్మెలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్.. శిరోముండనంతో నిరసన

by Indraja |
సమ్మెలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్.. శిరోముండనంతో నిరసన
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే.. మరోవైపు ఉద్యోగుల, కార్మికుల ఆందోళన హోరు అంబరాన్ని అంటుతోంది. ఓ వైపు ఎస్మా ప్రయోగించిన అంగన్ వాడీలు వెనకడుగు వెయ్యలేదు. మేము కూడా ఏమాత్రం తక్కువకాదు అంటూ పారిశుధ్య కార్మికులు సడలిపోని సంకల్పతో పోరాటం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన పారిశుద్ధ్య కార్మికుల పైనా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని అణిచివేత ధోరణని నిరసిస్తూ పారిశుధ్య కార్మికులు ఉద్యమాన్ని ఉదృతంగా కొనసాగిస్తున్నారు. చేస్తున్న ఉద్యమంలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

NTRజిల్లా లో మున్సిపల్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్‌ చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులపై విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపారు. మహిళలు, ముసలివాళ్ళు అని కూడా చూడకుండా, మానవతారాహిత్యంగా ఈడుచుకెళ్ళారు. ఈ నేపథ్యంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు గాయపడగా.. ఓ మహిళ స్పృహ కోల్పోయింది. చాల సమయం ఆమె స్పృహ లోకి రాలేదు. దీనితో ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాడుతున్న కార్మికులను పోలీసులతో కొట్టించడం న్యాయంకాదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లోనూ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడమని.. ఇతరులతో పారిశుధ్య పనులు చేయిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. కాగా 14 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు నిర్విరామంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీనితో ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎక్కడికక్కడ వ్యర్థాలు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయి.. ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దీనితో స్థానికులు రోడ్లపైకి రావాలంటే హడలెత్తుతున్నారు. ఇక విశాఖలో GVMC గాంధీ పార్క్‌వద్ద.. శిరోముండనం కార్యక్రమం చేపట్టిన కార్మికులు శిరోముండనం చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇక విజయనగరం, నెల్లూరు,ఒంగోలు,గుంటూరు, ఏలూరు ఇలా రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed