Farmers: హర్యానాలో14 మంది రైతుల అరెస్ట్.. పంట వ్యర్థాల దహనంపై చర్యలు

by vinod kumar |
Farmers: హర్యానాలో14 మంది రైతుల అరెస్ట్.. పంట వ్యర్థాల దహనంపై చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని కైతాల్ జిల్లాలో పంట వ్యర్థాలను తగుల బెట్టినందుకు గాను 14 మంది రైతులను అరెస్ట్ చేసినట్టు జిల్లా పోలీసు ఉన్నతాధికారి బీర్బన్ సోమవారం తెలిపారు. పంట వ్యర్థాలను కాలబెట్టడాన్ని నిషేధించినప్పటికీ రైతులు దానిని పట్టించుకోలేదని, అందుకే వారిపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గాలి (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. పానిపట్, యమునానగర్ సహా మరికొన్ని జిల్లాల్లోనూ ఇటీవల రైతులపై కేసులు నమోదయ్యాయి. కైతాల్‌లో ఇప్పటివరకు 130 పంట దహనం కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

పొట్టు తగులబెట్టిన వారిపై విచారణ జరపకపోవడంపై పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అక్టోబర్ 23న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు ​​జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి పంట చేతికొచ్చిన అనంతరం పంట వ్యర్థాలను రైతులు కాల్చేస్తారు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ చర్య జరుగుతోంది. దీని వల్ల వెలువడే పొగ వల్ల ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed