ఇసుక కుంభకోణం కేసు: పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు న్యాయవాదులు

by Seetharam |   ( Updated:2023-11-08 07:33:17.0  )
ఇసుక కుంభకోణం కేసు: పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు న్యాయవాదులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇసుక కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు నాయుడు పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం ఈ పిటిషన్‌ విచారణకొచ్చింది. అయితే విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని పాస్ ఓవర్ అడిగారు. దీంతో మధ్యాహ్నం పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు హయాంలో ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు ఇసుక పాలసీపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇసుక పాలసీపై కేబినెట్‌లో చర్చించలేదని సీఐడీ ఎఫ్ఐఆర్‌లో వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. అయితే ఈ కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు. 17ఏ ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సీఐడీ తీరును నిరసిస్తూ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed