ఠారెత్తిస్తున్న టమాటా: ఆకాశానికేసి చూస్తున్న ఉల్లి ధరలు

by Seetharam |
ఠారెత్తిస్తున్న టమాటా: ఆకాశానికేసి చూస్తున్న ఉల్లి ధరలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు రోజురోజుకు షాకిస్తున్నాయి. గతంలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కిలో ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది. కొనేటట్టు లేదు తినేటట్టు లేదు అన్నట్లుగా వినియోగదారులు ఆందోళణ వ్యక్తం చేశారు. చివరకు ప్రభుత్వాలు సబ్సిడీకింద టమోటాలను రైతుబజార్లలో విక్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. ఇటీవల కాలంలో ఉల్లిధరలు మళ్లీ పెరిగాయి. కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టించేంతలా పెరిగాయి. ఉల్లిధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరేలోపే మళ్లీ టామాటా ధరలు మోతమోగిస్తున్నాయి. ఒక్కసారిగా మార్కెట్‌లో ఉల్లి, టమాటా ధరలు మళ్లీ ఆకాశానికేసి చూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.60కి పైగా చేరగా.. కేజీ టమాటా రూ.30కి పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే వీటిని మరింత రేటు పెంచి విక్రయిస్తున్నారు. కిలో ఉల్లి కొన్ని ప్రాంతాల్లో 80 రూపాయలకు అమ్ముతుంటే టమాటా 50కి అమ్ముతున్నారు. దీంతో వినియోగదారులు హడలిపోతున్నారు. ఏం కొనేటట్లు లేదు తినేటట్లు లేదంటూ కూరగాయల ధరలను చూసి పెదవి విరుస్తున్నారు.

సాగు తగ్గడమే కారణమా?

తెలుగు రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వరుణుడు కరుణించడం లేదు. మరోవైపు సూర్యభగవానుడు భగ్గుమంటున్నాడు. దీంతో రాష్ట్రంలో పంటల సాగు తగ్గింది. అలాగే రైతులు సాగు చేసిన పంటకు నీరు అందకపోవడంతో దిగుబడులు రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ కారణాలే ధరలు పెరిగేందుకు కారణాలుగా తెలుస్తోంది. ఇకపోతే ఇతర రాష్ట్రాల్లోనూ కొత్తగా సాగు చేసిన ఉల్లి పంట ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. అందువల్లే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే టమాటా సాగులో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాంటిది రైతులు సాగు తగ్గించేశారు. గతేడాది ఖరీఫ్‌ నాటితో పోలిస్తే ఈసారి సాగు విపరీతంగా తగ్గింది. టమాటా మార్కెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన మదనపల్లె మార్కెట్‌కు 10 రోజుల నుంచి టమాటా రావడం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. అనంతరం మెల్లిగా ధరలు పతనం అయ్యాయి. ఎంతలా అంటే కనీసం రైతుకు గిట్టుబాటు ధర అందనంతగా పడిపోయాయి. దీంతో రైతులు టమాటాలనురోడ్డుపై పారేసి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి టమాటా ధరలు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయి.

Advertisement

Next Story