రేపు రాజమండ్రికి తలైవా? : చంద్రబాబుతో రజినీకాంత్ ములాఖత్

by Seetharam |   ( Updated:2023-09-15 12:30:33.0  )
రేపు రాజమండ్రికి తలైవా? : చంద్రబాబుతో రజినీకాంత్ ములాఖత్
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును కలిసి తన మద్దతు ప్రకటించాలని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 16న రాజమహేంద్రవరం చేరుకుంటారని తెలుస్తోంది. మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, బ్రహ్మణిలు ఉంటున్న నివాసానికి చేరుకుంటారని తెలుస్తోంది. అనంతరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ములాఖత్‌కు దరఖాస్తు చేస్తారని తెలుస్తోంది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ల మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా రజినీకాంత్ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రజినీకాంత్‌ చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. దీంతో వైసీపీ రజినీకాంత్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోల్ చేసింది. ఈ ట్రోల్స్‌ను సైతం రజినీకాంత్ లెక్కచేయకుండా చంద్రబాబుతో తన అనుబంధాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే.

లోకేశ్‌కు ఫోన్‌లో పరామర్శ

ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడును స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా రజినీకాంత్ స్పందించారు. నేరుగా నారా లోకేశ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆందోళన చెందవద్దని సూచించారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని అభివర్ణించారు. ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు ఏ తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయి అని రజినీకాంత్ తెలియజేశారు. అయితే తాజాగా ఈనెల 16న రజినీకాంత్ రాజమహేంద్రవరం వస్తారని ప్రచారం జరుగుతుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత భువనేశ్వరిని పరామర్శించిన అనంతరం చంద్రబాబును ములాఖత్‌లో కలుస్తారనే ప్రచారం జరుగుతుంది.

ములాఖత్ కష్టమే

ఇకపోతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో జాతీయ స్థాయిలో తన పోరాటాన్ని తెలియజేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా స్కిల్ స్కామ్ కేసులో జరిగిన పరిణామాలను జాతీయస్థాయి మీడియాకు లోకేశ్ వివరించనున్నారు. ఇదే సమయంలో జాతీయ స్థాయి నేతలతో భేటీ అయి తన తండ్రికి మద్దతు కోరనున్నారు. అలాగే ఏపీలో అప్రకటిత పరిస్థితులు దాపురించాయని తెలియజేయనున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సైతం ఈ కేసుకు సంబంధించి చర్చలు జరపడం అలాగే పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన విధివిధానాలపైనా లోకేశ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ రాజమహేంద్రవరం వస్తే పట్టించుకునే వారు ఉండరని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అందులోనూ ములాఖత్‌లో భాగంగా రజినీకాంత్‌కు అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. వారంలో రెండు సార్లు మాత్రమే ములాఖత్‌కు అధికారులు అనుమతి ఇస్తారు. ఇప్పటికే ఒకసారి నారా భువనేశ్వరి, బ్రహ్మణి, లోకేశ్‌లు చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో కలిశారు. అనంతరం పవన్ కల్యాణ్, లోకేశ్, నందమూరి బాలకృష్ణలు సైతం ములాఖత్‌లో భాగంగా చంద్రబాబును కలిశారు. తాజాగా గురువారం నారా భువనేశ్వరి మరోసారి ములాఖత్‌కు దరఖాస్తు చేయగా జైలు అధికారులు తిరస్కరించారు. రెండు సార్లు మాత్రమే అనుమతి ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఈనేపథ్యంలో రజినీకాంత్‌ములాఖత్‌కు ఛాన్స్ లేదని తెలుస్తోంది. వచ్చే వారం అంటే వినాయక చవితి అనంతరం రజినీకాంత్ రాజమహేంద్రవరం వస్తే అటు లోకేశ్ సైతం ఢిల్లీ పర్యటన ముగించుకుని రాజమహేంద్రవరం వస్తారని... అప్పుడు ములాఖత్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రజినీకాంత్ పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదనే సూచించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed