జీవోను రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యుల నిరసన.. 10 మంది సస్పెన్షన్

by sudharani |
జీవోను రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యుల నిరసన.. 10 మంది సస్పెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెంబర్ 1పై రగడ చోటు చేసుకుంది. జీవో నెంబర్1ను రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యులు సభలో పట్టుబట్టారు. శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాకముందే టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలను అణచివేసేందుకు.. రాజ్యాంగం హక్కులను హరించేందుకే జీవో నెంబర్ 1ను తీసుకొచ్చారని టీడీపీ సభ్యులు సభలో ఆరోపించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్1 రద్దుపై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు.

అయితే స్పీకర్ పోడియం వద్ద రెడ్ లైన్ గీత దాటితే వేటేనని ఇటీవలే సభ నిర్ణయించింది. ఈ గీతను దాటితే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్టేనని స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలో భాగంగా రెడ్ లైన్ దాటిన 10 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేలా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని న్యాయపోరాటం చేస్తుంటే తమను సభ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని టీడీపీ సభ్యులు అన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసినా పోరాటం చేసి తీరుతామని సభ్యులు హెచ్చరించారు.

Advertisement

Next Story