గర్భిణీకి నొప్పులు.. మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన 108 సిబ్బంది

by srinivas |   ( Updated:2024-07-21 12:46:44.0  )
గర్భిణీకి నొప్పులు.. మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన 108 సిబ్బంది
X

దిశ,వెబ్ డెస్క్: జోరు వానలో గర్బిణీకి పురిటి నొప్పులతో అల్లాడిపోయారు. ఆస్పత్రికి వెళ్లేందుకు అష్ట కష్టాలుపడ్డారు. కొట్టుకుపోయిన రోడ్లతో తీవ్ర అవస్థతలు పడ్డారు. కొంత దూరం డోలీలో వెళ్లి 108 సిబ్బంది సాయంతో చివరకు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురు వచ్చినా అధిగమించి గర్భిణీని 108 సిబ్బంది సేఫ్‌గా ఆస్పత్రికి చేర్చడంతో కథ సుఖాంతం అయింది.


అల్లూరి జిల్లా సీతారామరాజు జిల్లా డి. పోలవరం డివిజన్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం దెబ్బకు రోడ్లు కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ సమయంలో గ్రామానికి చెందిన గర్భిణీకి సడెన్‌గా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో 108 సిబ్బందికి ఫోన్ చేశారు. అయితే రోడ్డు సౌకర్యం సరిగాలేదు. దీంతో జోరువానలో గర్భిణీని 108 సిబ్బంది 3 కిలో మీటర్ల మేర డోలీలో తీసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌లో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురువచ్చాయి. ఆస్పత్రికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో పెద్ద చెట్టు కూలింది. అయినా సరే అంబులెన్స్ సిబ్బంది వెనక్కి తగ్గలేదు. జోరు వానను సైతం లెక్క చేయకుండా చెట్టును తొలగించారు. అనంతరం గర్భిణీని సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గర్భిణీకి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే ఇంత జోరువానలో అష్టకష్టాలు పడి గర్భిణీని సేఫ్‌గా ఆస్పత్రికి చేర్చిన 108 సిబ్బందిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘శభాష్ 108 సిబ్బంది’ అంటూ పొడుగుతున్నారు.

Advertisement

Next Story