కాంగ్రెస్‌తో వైసీపీ పొత్తు? పీకే సంచలన ప్రతిపాదన

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-24 03:05:35.0  )
కాంగ్రెస్‌తో వైసీపీ పొత్తు? పీకే సంచలన ప్రతిపాదన
X

దిశ, ఏపీ బ్యూరో: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటి వరకూ శత్రువులుగా ఉన్నవారు సడన్‌గా మిత్రులు కావొచ్చు. అలాగే మిత్రులు కూడా క్షణకాలంలో శత్రువులు కావొచ్చు. ఇంచుమించు అలాంటి అకస్మాత్తు సంఘటనను తెరమీదకు తేవడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా తెరమీదకు కాంగ్రెస్ -వైసీపీ పొత్తు అంశాన్ని ప్రతిపాదించి సంచలనం సృష్టించారాయన.

అసాధ్యాన్ని ప్రతిపాదించిన ఎన్నికల వ్యూహకర్త

వైసీపీ -కాంగ్రెస్‌ల మధ్య పొత్తు అని ఎవరైనా అంటే వెంటనే దాన్ని తోసిపారేస్తారు గతం తెలిసిన వారెవరైనా. కానీ ఇక్కడ ప్రతిపాదించింది ప్రశాంత్ కిషోర్. 2019లో వైసీపీ అన్ని సీట్లను పొందింది అంటే అందులో జగన్ పాత్రతో పాటు పీకే అని పిలువబడే ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా చాలానే ఉంది. అటువంటి పీకే ఇప్పుడు కాంగ్రెస్ సన్నిహితుడిగా ఆ పార్టీ దేశంలోని వివిధ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని, అందులో భాగంగా ఏపీలో వైసీపీతో జతకట్టాలని ప్రెజెంటేషన్ ఇవ్వడంతో అందరి దృష్టి అటుమళ్లింది.

జరిగే పనేనా ?

అడ్డగోలుగా ఏపీని విభజించి తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విభజన తర్వాత తాము జీరోగా మారిన ఏపీలో తిరిగి ఉనికి చాటుకునేందుకు అధికార వైసీపీతో కలిసి వెళ్లాలని ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి సూచించారు. దీంతో ఏపీలో కాంగ్రెస్-వైసీపీ పొత్తుపై కొత్త చర్చ మొదలైంది. 2019 ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందంటూ దూరం పెట్టారు వైసీపీ అధినేత జగన్. అయితే ఒకప్పుడు ఆయనను పార్టీ నుంచి బయటకు పంపి తీరని పొరబాటు చేశామని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ జగన్‌తో సానుకూల సంబంధాలను ఎప్పటి నుంచో ఆశిస్తోంది. దానికి తోడు పీకే ప్రతిపాదన కూడా ఇప్పుడు తోడయింది. ఇక జగన్ దీనిపై ఎన్నడూ స్పందించింది లేదు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో కొత్త సమీకరణాలు

ఈ పొత్తుల అంశం గురించి ప్రస్తావించినప్పుడు కొత్తగా మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ ఒక్కమాటతో అటువంటిది ఏదీ లేదని తేల్చేశారు. 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆ పార్టీ ప్రభావాన్ని కోల్పోయేలా చేసిన జగన్ మళ్ళీ ఆ పార్టీతో ఎందుకు కలుస్తారు? అంటూ కుండబద్దలు కొట్టేశారు. అయితే పార్టీ కీలక నేత విజయ సాయిరెడ్డి మాత్రం చాలా ఆచితూచి మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏ పార్టీ కాపాడుతుందో ఆ పార్టీకి వైసీపీ మద్దతిస్తుందంటూ తమ పార్టీ మనసులో మాట బయటపెట్టేశారు. పైగా దీనిపై జగన్ నిర్ణయం తీసుకుంటారు అని అన్నారు. దీంతో వైసీపీ అవసరాన్ని బట్టి దారులు తెరిచి ఉంచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్

బీజేపీకి జగన్ ఎంత నమ్మకంగా ఉంటున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీజేపీ ఎప్పుడూ ఏపీపై చిన్నచూపు చూస్తూనే ఉందన్న భావన అటు జగన్ లోనూ ఇటు వైసీపీలోనూ ఉంది. అలాగని బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికీ సిద్ధంగా లేరు. ఇప్పడు కావాల్సింది బీజేపీ దూకుడును నిలువరించి ఏపీకి రావాల్సిన నిధులు రాయితీలు రాబట్టుకోవడం. అలాగే వైసీపీకి ఢిల్లీ స్థాయిలో కేవలం తామొక్కరమే దిక్కు అనే అభిప్రాయం నుంచి బీజేపీని బయటకు లాగడం. దానికి కాంగ్రెస్‌తో పొత్తు అనే బూచి ఒక ఆధారంగా దొరికింది.. అని విశ్లేషకులు అంటున్నారు. అందువల్ల కొంతకాలం పాటు ఈ అంశంపై వైసీపీ ఇలానే దోబూచులాడి అనంతరమే పొత్తులపై స్పష్టత ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు

Advertisement

Next Story