AP News:డోలాయమానస్థితిలో పిఠాపురం వైసీపీ క్యాడర్..!

by Jakkula Mamatha |
AP News:డోలాయమానస్థితిలో పిఠాపురం వైసీపీ క్యాడర్..!
X

దిశ ప్రతినిధి, కాకినాడ:వైసీపీ తరపున అభ్యర్థిగా పిఠాపురంలో పోటీ చేసి, పార్టీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం కావాల్సిన వంగా గీత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అడ్రస్ లేరు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేసిన నేపథ్యంలో వైసీపీ క్యాడర్ అయోమయ పరిస్థితి ఎదుర్కొంటుంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అంచనాకు వచ్చారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గం కావడంతో రాజకీయంగా బయటపడవచ్చని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలంతా జనసేన వైపు చూస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి కింది స్థాయి వరకు క్యాడర్ లేకపోవటంతో జనసేన పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ ఇంచార్జ్ వర్మ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. అయితే జనసేన పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనతో వైసీపీ క్యాడర్‌ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ పదవుల్లో ఉన్న వారు కూడా అదే బాటలో ఉన్నారు. త్వరలో వైకాపా క్యాడర్ మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో జనసేన కండువాలు కప్పుకోనున్నారు. రెండు రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు నేతృత్వంలో వైసీపీ క్యాడర్ అంతా జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది.

Advertisement

Next Story

Most Viewed