ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌కు పయ్యావుల Keshav లేఖ

by sudharani |   ( Updated:2022-12-16 07:48:47.0  )
ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌కు పయ్యావుల Keshav లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : డిస్కంల వార్షిక ఆదాయ అవసరాల నివేదిక- వినియోగదారుల అభ్యంతరాలు – వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా బహిరంగ విచారణ జరపాలని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ సీవీ నాగార్జన రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం లేఖ రాశారు. ఏఆర్ఆర్ ప్రతిపాధనలపై బహిరంగ విచారణ ఏర్పాటు చేసి వినియోగదారుల నుంచి నేరుగా, రాతపూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించడం అనాధిగా వస్తోంది అని లేఖలో వెల్లడించారు. ఈ సాంప్రదాయానికి తిలోదకాలు ఇవ్వడం వినియోగదారుల హక్కులు కాలరాయడమేనని అభిప్రాయపడ్డారు. 2023-24 కు సంబంధించి డిస్కంల వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ ప్రకటన చేయడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కరోనా నిబంధనలు సడలించినప్పటికీ అభ్యంతరాలపై బహిరంగ విచారణను వీడియో కాన్పెరెన్సు ద్వారా మాత్రమే నిర్వహిస్తామని ప్రకటనలో చెప్పడం సరికాదన్నారు. గతంలో విచారణ బహిరంగంగా జిల్లాలలో జరిగేదని మరి ఈ ఏడాది కేవలం వీడియో కాన్పెరెన్సు ద్వారా మాత్రమే విచారణ చేపట్టాలని కమీషన్ నిర్ణయించడం అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. విద్యుత్ నియంత్రణ చట్టం స్పూర్తికి విరుద్దమని చెప్పుకొచ్చారు. మెజిస్ట్రేట్ నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని విచారణలు బహిరంగంగా జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు విచారణలు కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్న సమయంలో ఏ.పీ.ఈ.ఆర్.సీ వీడియో కాన్పెరెన్స్ కే పరిమితం అవడం వినియోగదారుల ప్రయోజనాలకు గండికొట్టడమేనంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చినా ఇప్పటికీ ఏ.పీ.ఈ.ఆర్.సీ కార్యాయంలో హైదరాబాద్ కే పరిమితమైంది. వెంటనే ఆంధ్రప్రదేశ్ కు తరలించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలి అని డిమాండ్ చేశారు.

విద్యుత్ నియంత్రణ మండలి వారు 2023 జనవరి 19, 20, 21 లలో అభ్యంతరాల నమోదుకు కేవలం మూడు రోజులు మాత్రమే అవకాశం కల్పించారు. సంస్థలు, సంఘాలు, సామాన్యులు విద్యుత్ టారిఫ్ లపై తమ అభ్యంతరాలు నమోదు చేయుటకు కేవలం మూడు రోజులు సమయం ఎలా సరిపోతుంది? జిల్లాకు ఒకరోజు చొప్పున అన్నీ జిల్లాలలో జరపాలి అని కోరారు. గత ఏడాది సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో రూ.6,165 కోట్ల ట్రూ అప్ భారాన్ని వినియోగదారులపై డిస్కంలు ప్రతిపాదించాయి. ఆ ట్రూ అప్ భారాన్ని రద్దు చేయాలని పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళన చేయడంతో రూ.2,910 కోట్లు వసూలుచేసుకుకేందుకు అనుమతి ఇవ్వడంతో ఆ మెత్తాన్ని డిస్కంలు ఈ ఏడాది ఆగష్టు నుంచే వసూలు చేయడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది మూడు డిస్కంలు ప్రతిపాదించిన యూనిట్ విద్యుత్ కొనుగోలు రేట్లలో కూడా తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థల సామర్ధ్యం పెంచుకోకుండా ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వ సంస్థల బకాయిలు వసూలు చేసుకోకుండా వినియోగదారులపై భారాలు మోపడాన్ని ఏ.పీ.ఈ.ఆర్.సీ అనుమతించరాదు. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటానికి బహిరంగ అభిప్రాయ సేకరణ నిర్వహించి వినియోగదారుల అభ్యంతరాలు స్వీకరించాలి అని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కోరారు.

Also Read..

ఏదీ పోరాట స్ఫూర్తి! కేంద్రాన్ని నిలదీయాలంటే భయమా?

Advertisement

Next Story

Most Viewed