Pawan Kalyan: అలాంటి మొక్కలను నాటకండి.. వాటివల్ల మనిషి ఆరోగ్యానికే ప్రమాదం.. డిప్యూటీ సీఎం (వీడియో)

by Kavitha |
Pawan Kalyan: అలాంటి మొక్కలను నాటకండి.. వాటివల్ల మనిషి ఆరోగ్యానికే ప్రమాదం.. డిప్యూటీ సీఎం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పలు శాఖలు నిర్వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యులు పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో భాగంగా వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29% మాత్రమే ఉన్న పచ్చదనాన్ని 50% కు తీసుకెళ్లడమే ప్రధాన ధ్యేయం. మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.

* కోనో కార్పస్ మొక్కలతో అనర్థాలు:

మన దేశ భౌగోళిక పరిస్థితులకు విరుద్ధంగా ఉండే, అన్య జాతుల మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అవి వేగంగా పెరుగుతాయని, ఎవెన్యూ ప్లాంటేషన్ అని, నిర్వహణ ఖర్చులు తక్కువ అనే కోణంలో గత దశాబ్ద కాలంగా కోనో కార్పస్, ఏడు ఆకుల పాల, మడగాస్కర్ ఆల్మన్, ఆస్ట్రేలియా తుమ్మ వంటి అన్యజాతుల మొక్కలను నాటారు. వీటి మూలంగా పర్యావరణానికి మేలు కంటే కూడా కీడు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్య జాతుల మొక్కలు- భూగర్భ జల సంపద మీద ప్రభావం చూపడంతో పాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయి.

* ఈ మొక్కలు నాటుదాం:

కార్తీక సమారాధన వరకు జరిగే ఈ వన మహోత్సవం వేళ దేశీయ జాతుల మొక్కలను, అందరికీ మేలు చేసే మొక్కలను విరివిగా పెంచుదాం. కానుగ, వేప, రావి, చింత, ఉసిరి, శ్రీగంధం, మర్రి, అశోక, రేలా, దిరిసెన మారేడు, నేరేడు, దేవకాంచన, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, సీత అశోక, వెలగ, సీతాఫలం వంటి ఎన్నో మనకు ఉపయోగపడే మన జాతుల మొక్కలను పెంచుదామని పవన్ కళ్యాణ్ సూచించారు. అందరికీ మేలు చేసే మొక్కలే మన నేస్తాలు. అందరం సమష్టిగా వన మహోత్సవంలో పాల్గొని రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపుదాం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు.

(video link credits to JanaSena Party X account)

Advertisement

Next Story

Most Viewed