‘ఒకే దేశం -ఒకే ఎన్నిక’ ఆచరణ సాధ్యం కాదు.. సీపీఐ నాయకురాలు కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘ఒకే దేశం -ఒకే ఎన్నిక’ ఆచరణ సాధ్యం కాదు.. సీపీఐ నాయకురాలు కీలక వ్యాఖ్యలు
X

దిశ, రాజమహేంద్రవరం: కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలి ఎన్నికల విధానం భారతదేశంలో ఆచరణ సాధ్యం కాదని దీనివల్ల అధ్యక్ష నియంతృత్వ పరిపాలనకు దారి తీస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తెలిపారు. నేడు (శనివారం) శాఖ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ.. భారతదేశం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు బహుళ రాజకీయ ప్రాంతీయ పార్టీలతో కూడిన వైవిధ్య భరితమైన భారతదేశం అని దీంట్లో ఒకే దేశం ఒకే ఎన్నిక ఆచరణ సాధ్యం కాదని ఆమె అన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాలు ఉంటాయని ఒక్కొక్కసారి ఆయా ప్రాంతీయ రాజకీయ పార్టీలు మద్దతు ఉపసంహరిస్తే మరల ఐదు ఏళ్ల వరకు ఎన్నికలు ఉండవని ఇది మోడీ అధ్యక్ష నియంతృత్వానికి చేయడానికి మోడీ కుట్రని ఆమె అన్నారు.

2014 అధికారంలో మోడీ వచ్చిన తర్వాత దేశం తిరోగమన వైపు వెళుతుందని మతం, కులం పేరుతో ప్రజల్లో వైశ్యమాలు సృష్టించి ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే హిందూ మతోన్మాదం పేరుతో ఓట్లు రాజకీయాలు మోడీ చేస్తున్నారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో ఎప్పుడూ లేనంతగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మంచు నూనె ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ఏ స్వతంత్రం కోసమైతే భగత్ సింగ్ ఉరికంబం ఎక్కారో ఇప్పటికీ ఆ స్వతంత్ర ఫలాలు ప్రజలకు అందలేదని ఆమె అన్నారు. సామ్రాజ్యవాద విష సంస్కృతి యువత మెదడులో ఉందని నేటి యువత సమాజం కోసం సోషలిజం కోసం ఆలోచించి భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆమె కోరారు.

స్వాతంత్య్రం కోసం పోరాడని ఆర్ఎస్ఎస్ బీజేపీ నేడు దేశభక్తి పాటలు చెబుతుందని దేశ చరిత్రను వక్రీకరిస్తుందని ఆమె విమర్శించారు. దేశంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని ఎత్తు వేయడానికి కుట్రలు చేస్తున్నదని ఆమె తెలిపారు. ఈ రాష్ట్రంలో పోలవరం విశాఖపట్నం ఉక్కు, వరద బాధితుల సహాయం నిరుద్యోగ సమస్య చాలా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటికోసం కూటమి ప్రభుత్వం ఆలోచించకుండా లడ్డూ రాజకీయం చేస్తుందని ఇప్పటికైనా దేవుని రాజకీయాల్లోకి రావడం మానివేయాలని ఆమె సున్నితంగా తెలిపారు. బీజేపీ ట్రాప్‌లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పడకూడదని ఆమె హితవు పలికారు. కమ్యూనిస్టు పార్టీ సీపీఐ డిసెంబర్ 26తో శత వార్షికోత్సవాలు ప్రారంభమవుతున్నాయని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Next Story