ఎన్నికల ఫలితాల వేళ.. తిరుపతిలో హై అలర్ట్

by srinivas |   ( Updated:2024-06-03 14:49:39.0  )
ఎన్నికల ఫలితాల వేళ.. తిరుపతిలో హై అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల ఫలితాల వేళ తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. దీంతో తిరుపతిలో సర్వం సిద్ధం చేశారు. తిరుపతి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగాయి. పోలింగ్ తర్వాత ఈవీఎం మిషన్లలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉంచారు. ఇక కౌంటింగ్ సైతం ఈ వర్సిటీలోనే జరగనుంది. తిరుపతి జిల్లాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలను పద్మావతి మహిళా యూనివర్సిటీలోనే ఏర్పాటు చేశారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ యూనివర్సిటీలోనే ఓట్లను లెక్కించనున్నారు. దీంతో యూనివర్సిటీకి 2 కిలో మీటర్ల మేర రెడ్ జోన్‌గా ప్రకటించారు.

ఇక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఇదే యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీలో ఉంచిన ఈవీఎం మిషన్లను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. దీంతో తిరుపతిలో టెన్షన్ వాతావరణ నెలకొంది. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తిరుపతిలో 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అనుమతి లేని ఎవరైనా సరే యూనివర్సిటీ వైపు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిజల్ట్స్ తర్వాత తిరుపతిలో ఎలాంటి సంబురాలు చేసేకునేందుకు సైతం అనుమతి నిరాకరించారు.

Advertisement

Next Story

Most Viewed