మళ్లీ ఢిల్లీకి నారా లోకేష్.. సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు

by Javid Pasha |   ( Updated:2023-10-07 07:36:13.0  )
మళ్లీ ఢిల్లీకి నారా లోకేష్.. సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం రాజమండ్రి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి నేరుగా విమానంలో హస్తినకు బయల్దేరనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి వాదనలు జరగనున్నాయి. దీంతో సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడేందుకు హస్తినకు వెళుతున్నారు.

సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై ఇటీవల వాదనలు జరగ్గా.. 9వ తేదీకి విచారణ వాయిదా పడింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందించాలని సీఐడీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 9వ తేదీలోపు కోర్టు ముందు ఉంచాలని తెలిపింది. దీంతో సోమవారం వాడీవేడిగా వాదనలు జరిగే అవకాశముంది. దీంతో సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇస్తుందా..? లేదా వాదనలను కొనసాగిస్తుందా? అనేది టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే లోకేష్ వెంటనే అమరావతికి చేరుకుంటారు.

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాకపోతే మరికొద్దిరోజుల పాటు లోకేష్ ఢిల్లీలోనే ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి లోకేష్ చేరుకున్నారు. అనంతరం శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. సుప్రీంకోర్టు, ఏసీబీ కోర్టుల్లో పిటిషన్లకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అలాగే పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. చంద్రబాబును కలిసిన అనంతరం భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేష్ మీడియాతో మాట్లాడారు. కేసులకు భయపడే పరిస్థితి లేదని, న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

Advertisement

Next Story