ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలు

by Seetharam |   ( Updated:2023-10-03 15:15:34.0  )
ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో మంగళవారం రెండు లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో ఒకటి ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించినది కాగా మరోకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌కేసుకు సంబంధించినది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోసం లోకేశ్‌ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు తీసుకురావాల్సిన పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేశ్ మరో సీఐడీ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్లపై మధ్యాహ్నాం 2.15 గంటలకు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫైబర్ గ్రిడ్‌కేసుతో నాకు సంబంధం లేదు

ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మంగళవారం నారా లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తన పేరును చేర్చడంపై లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధం లేని అంశంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేశ్ ఆరోపించారు. 2017లో తాను ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టానని.. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అనేది 2014లో ప్రారంభించినట్టుగా లోకేశ్ పిటిషన్‌లో తెలిపారు. పంచాయితీరాజ్, ఐటీ శాఖలను తాను పర్యవేక్షించానని.. అసలు ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు ఈ రెండు శాఖలకు ఎలాంటి సంబంధం లేదని నారా లోకేశ్ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు స్వీకరించింది. మంగళవారం మధ్యాహ్నం 02:15 గంటలకు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించనుంది.

41ఏ నోటీసుల్లోని నిబంధనలపై లోకేశ్ అభ్యంతరం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులోనూ నారా లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సీఐడీ నోటీసులు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. అయితే సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసుల్లో కొన్ని అంశాలపై లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరయ్యేటప్పుడు హెరిటేజ్ సంస్థకు చెందిన తీర్మానాలు, అకౌంట్ బుక్స్ తీసుకురావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొనడాన్ని లోకేశ్ తప్పుబట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానని... అలాంటప్పుడు వాటిని తానెలా తీసుకొస్తానని అన్నారు. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా దీన్ని కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Advertisement

Next Story