‘నిజం గెలవాలి’ బస్సు యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి

by Seetharam |
‘నిజం గెలవాలి’ బస్సు యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్రను ప్రారంభించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నారావారిపల్లె నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రగిరికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదన తో మృతి చెందిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. నారా భువనేశ్వరి వెంట టీడీపీ నేతలు, ఇంఛార్జిలు ఉన్నారు. చంద్రగిరి చేరుకున్న అనంతరం టీడీపీ కార్యకర్త ప్రవీణ్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తట్టుకోలేక ప్రవీణ్ రెడ్డి ఈనెల 17న చనిపోయాడు. దీంతో ఆకుటుంబం శోకసంద్రంలో నిండిపోయింది. నారా భువనేశ్వరి ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నారా భువనేశ్వరిని చూసి ప్రవీణ్ రెడ్డి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తన కుమారుడు ప్రవీణ్ రెడ్డి తట్టుకోలేకపోయారని విలపించారు. టీవీల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వార్తను, బెయిల్ రాకపోవడాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని నారా భువనేశ్వరి ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి హామీ ఇచ్చారు.

భువనేశ్వరి పర్యటన వివరాలివే!

నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్రను తొలిరోజు అయిన బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తొలి విడత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈ మూడు రోజులూ ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మృతి చెందిన టీడీపీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మహిళలతో ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొంటారు. తొలి రోజైన బుధవారం 25న చంద్రగిరిలో సమావేశంలో పాల్గొంటారు. 26న గురువారం తిరుపతిలో, 27న శుక్రవారం శ్రీకాళహస్తిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed