ఏపీలో సామాన్యుడికి గుడ్ న్యూస్.. అందుబాటులో నిత్యావసరాల ధరలు

by srinivas |
ఏపీలో సామాన్యుడికి గుడ్ న్యూస్.. అందుబాటులో నిత్యావసరాల ధరలు
X

ఏపీ బ్యూరో, అమ‌రావ‌తి: బహిరంగ మార్కెట్లో చుక్కలు తాకుతున్న నిత్యావసర సరుకుల ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాయితీపై బియ్యం, కంది పప్పు విక్రయిస్తున్నామని అన్నారు. ఒకరికి 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు ఇస్తున్నామని, కనీస స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉంచి ప్రజల డిమాండ్ ఆధారంగా పెంచుతామన్నారు. గురువారం విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్‌లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బియ్యం, కంది పప్పు అమ్మకాల కౌంటర్‌ను స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “పేదలకు ఇది పండగ రోజు. సామాన్యుడికి నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 284 స్టాల్స్ ఏర్పాటు చేశాం. కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో దాదాపు కిలో రూ.181 అమ్ముతున్నారు. బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ అవుట్ లెట్లు ప్రారంభించాం. ఈ అవుట్ లెట్లులో కిలో దేశవాళి కందిపప్పు రూ.160కే అందిస్తున్నాం. అలాగే సోనామసూరి (స్టీమ్డ్) కిలో రూ.49 , సాధారణ రకం రూ.48 కే విక్రయిస్తున్నాం. ప్రతి రోజు 125 క్వింటాల కందిపప్పు అందుబాటులో ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజల డిమాండ్ ఆధారంగా పెంచుతాం. రాబోయే రోజుల్లో కందిపప్పు, బియ్యంతో పాటు మిల్లెట్స్, పంచదార, రాగి పిండి తక్కువ ధరకే అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రైతు, వినియోగదారుడికి మేలు జరగాలన్నదే మా ఆకాంక్ష. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి'' అని మ‌నోహ‌ర్ కోరారు.

రూ.1000 కోట్లు విడుదల చేశాం

రైతుల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా చాలా పర్యటనలు చేసిన‌ట్లు మ‌నోహ‌ర్ గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, సేకరించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించాలని గతంలో పవన్ కళ్యాణ్ కాకినాడలో దీక్ష కూడా చేశార‌ని మంత్రి గుర్తు చేశారు. అయినా నాటి ప్రభుత్వంలో చలనం రాలేద‌న్నారు. కనీసం రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా రూ.1650 కోట్లు బకాయిలు పెట్టిన ఘ‌న‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వానిద‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల చొరవతో రూ. 1000 కోట్లు రైతులకు బకాయిలు చెల్లించామ‌ని, మరో రూ. 650 కోట్లు త్వరలోనే చెల్లిస్తామ‌ని తెలిపారు.

అయిదుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర

రాజకీయాల ముసుగులో కొంతమంది పెద్దలు పేదల బియ్యాన్ని కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తార‌ని నాదేండ్ల మ‌నోహ‌ర్ ఆరోపించారు. కూట‌మి ప్రభుత్వంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా దాడులు చేస్తూ నియంత్రిస్తున్నామ‌న్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చార‌ని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క కాకినాడలోనే 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామ‌ని మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయ‌ని, ఈ మాఫియా వెనక చాలా మంది పెద్దల హస్తం ఉందని, ముఖ్యంగా ఐదుగురు ఐపీఎస్ అధికారుల హస్తం ఉందని అధికారులు గుర్తించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోంద‌ని, దోషులుగా తెలితే ఎంతటి వారిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు.

Advertisement

Next Story