AP News:పర్యాటక ప్రాంతాల్లో పనుల ప్రగతిపై సమీక్ష.. వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్

by Jakkula Mamatha |
AP News:పర్యాటక ప్రాంతాల్లో పనుల ప్రగతిపై సమీక్ష.. వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖపట్నం, తిరుపతిలో త్వరలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఈ మేరకు ఆయన నేడు (మంగళవారం) వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల్లో పనుల ప్రగతిపై మంత్రి దుర్గేష్ సమీక్షించారు. 2024 డిసెంబర్‌లో విజయవాడ వివంత హోటల్‌లో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో వచ్చిన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించారు. పర్యాటక రంగ అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మెండుగా ఉందని, సీఎం చంద్రబాబు పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు.

ఈ క్రమంలో త్వరితగతిన పనులు పూర్తి చేసి తమ శాఖ సమర్థతను నిరూపించుకోవాలని అధికారులను మంత్రి దుర్గేష్ ఆదేశించారు. త్వరలోనే పర్యాటక ప్రాంతాల్లో పర్యటనలు నిర్వహిస్తానని, పర్యాటకాభివృద్ధి పనుల తీరును స్వయంగా పర్యవేక్షిస్తానని, ఈ నేపథ్యంలో పనుల పై మరింత దృష్టి సారించాలని అధికారులకు మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఒబెరాయ్, మేఫేర్, తాజ్ గ్రూప్, హయత్, మహేంద్ర, స్టెర్లింగ్ తదితర సంస్థల ప్రతిపాదనలపై మంత్రి చర్చించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రతిపాదనలు పరిశీలించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా వారికి కల్పించాల్సిన రాయితీలపై చర్చించారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో 8 బీచ్‌లను తొలుత అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బీచ్‌ల్లో సుందరీకరణ, పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా, బాత్ రూమ్‌ల ఏర్పాటు తదితర మౌలిక వసతుల అంశంపై చర్చ రాగా స్వచ్ఛ భారత్‌లో భాగంగా బీచ్ ప్రాంతాల్లో క్లీనింగ్ చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. స్థానికంగా ఉండే పెద్ద పారిశ్రామిక సంస్థల తో చర్చించి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కోరాలని అధికారులకు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి ఆధునికీకరణ పూర్తి చేసుకుంటున్న టూరిజం హెటళ్లను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విశేష ప్రాచుర్యం కల్పించే విషయంలో సినిమా రంగంలోని సెలబ్రిటీల సహాయ సహకారాలను తీసుకోవాల్సిన అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి నిధులతో చేపట్టే అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అమలు తీరుపై అధికారులకు మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed