టీడీపీలోకి వలసలే వైసీపీ పతనానికి నాంది:జీవీ ఆంజనేయులు

by Disha Web Desk 18 |
టీడీపీలోకి వలసలే వైసీపీ పతనానికి నాంది:జీవీ ఆంజనేయులు
X

దిశ,వినుకొండ:రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలే ఆ పార్టీ పతనానికి నాంది అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కూటమి ఉమ్మడి అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు.ఎన్నికల నాటికి వైసీపీ మరింత డీలా పడటం ఖాయమని, వినుకొండ వైసీపీలో చివరికి బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కరే మిగులుతారేమోనని ఎద్దేవా చేశారు. బొల్లా అవినీతి, అక్రమాలు భరించలేకే ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి.బొల్లాపల్లి మండలంలో పలు గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. గండిగనుములలో ఏకంగా 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో వీరంతా జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు, మాజీ ఎమ్మెల్యే మక్కెన సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వారితో పాటు గుట్లపల్లి కి చెందిన 10 వైసీపీ కుటుంబాలు జీవీ సమక్షంలో టీడీపీలో చేరాయి.ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనతో విసిగిపోయిన అన్ని వర్గాలు తెలుగుదేశం వైపు మొగ్గుతున్నాయన్నారు. అభివృద్ధి, ప్రజల అవసరాలు గాలికి వదిలేసి దోచుకోవడం, దాచుకోవడమే ఎమ్మెల్యే బొల్లా నైజమని జీవీ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, టీడీపీ పార్టీలోకి భారీగా చేరికలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్న, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితేనే సాధ్యమన్నారు. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను మరోసారి ఆదరించాలని కోరారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తామన్నారు.


Next Story