మిచౌంగ్ ఎఫెక్ట్: విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు

by Seetharam |
మిచౌంగ్ ఎఫెక్ట్: విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు
X

దిశ,డైనమిక్ బ్యూరో: మిచౌంగ్‌ తుపాను బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోనసీమ, రాయలసీమ ప్రాంతాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి.ఇకపోతే చెన్నైలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపింది. విశాఖ నుంచి హైదరాబాద్‌ బయలుదేరాల్సిన రెండు సర్వీసులు, ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తుపాను ప్రభావం ఏపీ‌తోపాటు తమిళనాడులోనూ కనిపిస్తోంది. దాంతో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పటి వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించినట్లు తెలుస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Advertisement

Next Story