Manohar Nadendla: వాళ్లే అసలైన లీడర్స్.. జగన్‌కు మాట్లాడే అర్హత ఉందా? ఏపీ మంత్రి హాట్ కామెంట్స్

by Ramesh Goud |
Manohar Nadendla: వాళ్లే అసలైన లీడర్స్.. జగన్‌కు మాట్లాడే అర్హత ఉందా? ఏపీ మంత్రి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసలైన లీడర్స్ అని, లీడర్ అంటే వారి లాగా స్పందించే మంచి మనసుండాలని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీ నేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా నిలబడుతుందని, త్వరలోనే ప్రతీ ఒక్క వరద బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని, రైతులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగకుండా ప్రజల్లో ఉండి వరద సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారని, అలాంటి వారిని అభినందించాల్సింది పోయి, జగన్ విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఏలేరు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, గత ఏదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. ఏలేరు వరద గురించి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు, రానున్న రోజుల్లో ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణ చేపట్టి భవిష్యత్తులో వరద ముప్పు నుండి కాపాడుతామని స్పష్టం చేశారు.

జగన్ కు మాట్లాడే అర్హత ఉందా..?

అలాగే మా నాయకుడు, పవన్ కళ్యాణ్ దాదాపు 6 కోట్లు వరద బాధితులకు విరాళంగా ప్రకటించారని, వైసీపీ ఎంఎల్ఏ జగన్ కనీసం ఒక్క లక్ష రూపాయలు అయినా అందించారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఆదుకోకపోగా.. ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని నాదెండ్ల మండిపడ్డారు. అసలు జగన్ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు అని, ఆనాడు చేసిన పాపాల వల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదా? దీని గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఉందా అని నిలదీశారు. జగన్ పిఠాపురం వెళ్లి పది పేపర్లు చేతిలో పట్టుకొని హాడావుడి చేశారని, లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాగా స్పందించే మంచి మనసు ఉండాలని, కాగితాలు చేతిలో పట్టుకొని ఊగిపోతే లీడర్ అయిపోరని విమర్శలు చేశారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ముందుండి నిలబడాలని, 74 ఏళ్ల వయసులో చంద్రబాబు ప్రతీరోజు నాలుగు సార్లు వదరల్లో తిరిగారని, పార్టీ అధ్యక్షుడిగా జగన్, వైసీపీ నాయకులు ప్రజలకు ఏ విధంగా సేవలు అందించారో చెప్పాలన్నారు.

రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు

ఇక ఏపీలో రేషన్ బియ్యం దారి మళ్లించడంపై స్పందించిన ఆయన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడలో జరిపిన సోదాల్లో పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఒక కుటుంబం కనుసన్నల్లోనే పోర్టులో అక్రమ సరఫరా జరిగిందని తెలిపారు. సీఎం చంద్రబాబుతో చర్చించి రేషన్ మాఫియాపై విచారణ చేయిస్తామని, పేదల బియ్యం దారిమళ్లింపుపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అధికారుల నుంచి సమగ్ర నివేదిక అందగానే రేషన్ బియ్యం దారి మళ్లించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం నుంచి అదనపు వివరాలు సేకరిస్తున్నామని, కూటమి ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తోందని నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed