- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభకా?అసెంబ్లీకా?: గంటి హరీశ్ మాథుర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై గందరగోళం
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైంది.దీంతో ఆయా పార్టీలు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. ఇకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీ యువకులకే పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించింది. 40 శాతం టికెట్లు యువతకేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్నారు. ఇదే కోవలో మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత బాలయోగి తనయుడు గంటి హరీశ్ మాథుర్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలని కంకణం కట్టుకున్నారు. అయితే ఎంపీగా పోటీ చేయాలా? ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? అన్న సందిగ్ధంలో పడ్డారు. హరీశ్ మాథుర్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసేదానికన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల్లోనే ఉండాలని హరీశ్ మాథుర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ అధిష్టానం అటు లోక్‌సభకు పంపాలా? లేక అసెంబ్లీకి పంపాలా? పొత్తులో భాగంగా టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
నిత్యం ప్రజల్లోనే..
దివంగత లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి వారసుడిగా గంటి హరీశ్ మాథుర్ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. రాజకీయాల్లోకి వచ్చీరాగానే అమలాపురం లోక్‌సభకు పోటీ చేశారు. హరీశ్ మాథుర్ గెలుపు కోసం నారా లోకేశ్ సైతం రంగంలోకి దిగారు. హరీశ్ ఆ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. వైసీపీ వేవ్‌లో తొలి ప్రయత్నంలోనే ఓటమి పాలయ్యారు. టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో హరీశ్ ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి చింతా అనురాధ చేతిలో సుమారు 39 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ హరీశ్ మాథుర్ ఏమాత్రం దిగులుపడకుండా ప్రజల్లోనే తిరుగుతున్నారు. అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జిగా లోక్‌సభ నియోజకవర్గం అంతటా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యటిస్తున్నారు. అంతేకాదు టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చే ఏ కార్యక్రమాన్ని తూచ తప్పకుండా నిర్వహిస్తూ టీడీపీ కార్యకర్తలకు మరింత దగ్గరయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ అమలాపురం లోక్‌సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.
ఎంపీగా పోటీ చేస్తారా?
ఇకపోతే గంటి హరీశ్ మాథుర్ పార్లమెంట్‌కు పోటీ చేస్తారా? అసెంబ్లీకి పోటీ చేస్తారా? అనే అంశంపై పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పెద్దలతోపాటు జిల్లాలోని నాయకులు హరీశ్ మాథుర్‌ను మళ్లీ లోక్‌సభకు పోటీ చేయాలని సూచిస్తున్నారు. ఈసారి లోక్‌సభ నుంచి ఖచ్చితంగా హరీశ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం అమలాపురం ఎంపీ చింతా అనురాధ వచ్చే ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటి హరీశ్ మాథుర్ గెలుపు మరింత ఈజీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం సైతం అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జిగా గంటి హరీశ్ మాథుర్‌ను కొనసాగిస్తూ వస్తోంది. దీంతో హరీశ్ మాథుర్ ఎంపీగా కొనసాగుతారనే ప్రచారం టీడీపీలో సైతం ఉంది.
మధ్యేమార్గంగా అమలాపురం
ఇదిలా ఉంటే గంటి హరీశ్ మాథుర్ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేసి కేబినెట్‌లో మంత్రిగా పనిచేయాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలైన అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. అటు జనసేన నుంచి శెట్టిబత్తుల రాజబాబు సైతం టికెట్ ఆశిస్తున్నారు. అయితే అయితాబత్తుల ఆనందరావుకు టీడీపీలోని ఓ వర్గం సహాయనిరాకరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు నాన్ లోకల్ కావడంతో అది ఆయనకు మైనస్‌గా మారింది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అమలాపురం నియోజకవర్గం హెడ్‌క్వార్టర్ కావడంతో మధ్యే మార్గంగా హరీశ్ మాథుర్‌ను బరిలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒకవైపు ప్రచారం జరుగుతుంది.
ఆప్షన్‌గా పి.గన్నవరం
మరోవైపు పి.గన్నవరం నియోజకవర్గం నుంచి కూడా గంటి హరీశ్ మాథుర్ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం పి.గన్నవరం నియోజకవర్గం బాధ్యతలను పర్యవేక్షిస్తున్న వారిలో గంటి హరీశ్ మాథుర్ ఒకరు. పి.గన్నవరం నియోజకవర్గంలో అటు టీడీపీ ఇన్‌చార్జి, జనసేన పార్టీ ఇన్‌చార్జిలు లేరు. రెండు పార్టీలకు ఇన్‌చార్జిలు లేకపోవడంతో ఉమ్మడి అభ్యర్థిగా హరీశ్ మాథుర్‌ను చివరి నిమిషంలో బరిలోకి దించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఒకవేళ అమలాపురం మధ్యేమార్గంగా హరీశ్‌కు ఇస్తే పి.గన్నవరం నియోజకవర్గం జనసేనకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జనసేన పార్టీ నాయకుడు పెనుమాల దేవీ జాన్ బాబు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. మెుత్తానికి గంటి హరీశ్ మాథుర్ పొలిటికల్ భవిష్యత్‌పై ఇప్పటికీ సందిగ్ధం వీడటం లేదు. గంటి హరీశ్ కుమార్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అది క్లారిటీ వస్తే మిగిలిన టికెట్ల పంపకం అటు జనసేన ఇటు టీడీపీలకు ఈజీ అవుతుందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. మెుత్తానికి ఈ టెన్షన్‌కు మరికొన్ని రోజుల్లో అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.