వారి బాధలను ఓపికతో వినండి.. సీఎం చంద్రబాబు ఆదేశం

by Anil Sikha |
వారి బాధలను ఓపికతో వినండి.. సీఎం చంద్రబాబు ఆదేశం
X

దిశ, డైనమిక్​బ్యూరో : ప్రజలు తమ వద్దకు వ‌చ్చిన‌ప్పుడు వారి బాధ‌లు, సమస్యల గురించి అధికారులు, సిబ్బంది ఓపిగ్గా వినాల‌ని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వ‌స్తుంద‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల‌కు సూచించారు. స‌చివాల‌యంలో ప‌బ్లిక్ ఎఫైర్స్​పై స‌మాచార పౌర‌సంబంధాల శాఖ సంచాల‌కులు హిమాంశు శుక్లా ప్రజంటేషన్​ ఇచ్చారు. దీనిపైన సీఎం స్పందిస్తూ ప్రభుత్వంలో కొంత‌మంది అధికారులు, సిబ్బంది ప్రజలతో ప్రవర్తించే తీరు వ‌ల్ల చెడ్డ పేరు వ‌స్తోంద‌న్నారు. పింఛ‌న్లు పంపిణీకి మ‌నం రెండు రోజులు స‌మ‌యం పెట్టుకున్నామ‌ని, అయితే పింఛ‌న్ల పంపిణీలో కొంత‌మంది ల‌బ్దిదారుల‌తో దురుసుగా ప్రవర్తించడం, ద‌బాయించ‌డం లాంటి ఫిర్యాదులు త‌మ దృష్టికి వస్తున్నాయ‌ని అన్నారు. దీనివ‌ల్ల మ‌నం మంచి చేస్తున్నా ప్రజల్లో చెడ్డపేరు వచ్చే అవ‌కాశ‌ముంద‌న్నారు.

ముందు మ‌న ప్రవర్తనలో మార్పు రావాల‌న్నారు. మ‌నంద‌రం ప్రజలకు జావాబుదారీ అనేది గుర్తుంచుకోవాల‌ని తెలిపారు. మ‌న వ‌ద్దకు వ‌చ్చిన వారు తెచ్చిన స‌మ‌స్యల్లో కొన్ని మ‌నం పరిష్కరించేవి ఉంటాయి, కొన్ని మ‌నం పరిష్కరించలేనివి కూడా ఉంటాయి, అయితే వాటిన్నిటికంటే ముందు ముందు ప్రజలు మ‌న వద్దకు వ‌చ్చిన‌ప్పుడు వారి బాధలు, వారి స‌మ‌స్యల‌ను ఓపిగ్గా విన‌డం ప్రధానం అన్నారు. అధికారుల ప‌నితీరు అంచ‌నా వేయ‌డంలో వారి ప్రవర్థన కూడా చాలా కీల‌కంగా ఉంటుంద‌ని, దీన్ని గుర్తుంచుకుని అంద‌రూ ప‌నిచేయాల‌న్నారు. ప్రభుత్వం చేస్తున్న ప‌నుల ప‌ట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తిని మ‌దింపు వేయ‌డానికి ఒక వినూత్న పద్ధతిని అమ‌లు చేస్తామ‌న్నారు. రాబోయే రోజుల్లో బిగ్ డేటా వ‌చ్చాక ఏ ఫంక్షనరీ ఏ విధంగా ప‌ని చేస్తున్నార‌ని, లోపాలు ఎక్కడున్నాయి అనేది మ‌న‌కు ఒక అంచ‌నా వ‌స్తుంద‌న్నారు.

Next Story

Most Viewed