జనసేనతో కలిసి పనిచేద్దాం... వైసీపీపై పోరాడుదాం : Daggubati Purandeswari

by Seetharam |   ( Updated:2023-08-23 10:21:05.0  )
జనసేనతో కలిసి పనిచేద్దాం... వైసీపీపై పోరాడుదాం : Daggubati Purandeswari
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అప్పుల భారంతో రాష్ట్రం కుంగిపోతుందన్నారు. విశాఖలోని ఆర్ అండ్ బి కూడలి మారియట్ హోటల్‌లో బుధవారం జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధి కారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కొత్త కార్యవర్గానికి పురంధేశ్వరి అభినందనలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన నాయకులు, కార్యకర్తలు పార్టీకి అంకిత భావంతో పని చేయాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. కొంత మందికి పదవి లేదని బాధ వుండొచ్చు. తన మూడేళ్ల పదవీ కాలంలో కార్యకర్తలు సంతృప్తి పడేలా పనితీరు ఉంటుంది అని చెప్పుకొచ్చారు. పధాధి కారులు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి అని పురంధేశ్వరి సూచించారు. టీడీపీ హయాంలో రూ.3.44 లక్షల కోట్లు అప్పులు ఉండగా వైసీపీ హయాంలో అవి రూ. 7.44 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. తాను లేవనెత్తిన అంశాలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆస్తుల తనఖా, నిధుల మళ్లింపు, కాంట్రాక్టర్‌లకు బిల్లుల పెండింగ్‌పై ఎలాంటి వివరాలను బయట పెట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెవరేజేస్ బాండ్లు కొనుగొలుకి ఎవరూ రాకపోవడం బీజేపీ విజయం అని అభివర్ణించారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు. బీజేపీ ఆందోళన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం రూ.980 కోట్ల నిధులు ఇచ్చారు. గ్రామ సభ ఆమోదం లేకుండా 70 శాతం విద్యుత్ బిల్లుల కింద ప్రభుత్వం మినహాయింపు అన్యాయం అన్నారు. నిధుల మళ్లింపు పై ఆందోళన నిర్వహించాలి అని పిలుపునిచ్చారు. మిత్ర పక్షం జనసేనతో కలిసి పని చేయాలని పురంధేశ్వరి సూచించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారుని ఫలితంగా ఎంతోమంది చనిపోతున్నారు అని దగ్గుబాటి పురంధేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు.

రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ

టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లపై నమ్మకం ఉన్నవారినే చైర్మన్‌గా నియమించాలని సూచించారు. రాజకీయ పునరావాసం మాదిరిగా టీటీడీ పోస్టింగ్‌లు వుంటున్నాయి అని ధ్వజమెత్తారు. అలిపిరి మెట్ల మార్గంలో ఆరేళ్ల చిన్నారి మృతి దురదృష్టకరం అన్న దగ్గుబాటి పురంధేశ్వరి భక్తులు చేతి కర్రలతో మృగాలతో పోరాటం చెయ్యాలనడం హాస్యాస్పదం అని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మత మార్పిడి జరుగుతోందని, అక్కడ అడవులు నాశనం అవుతుంటే టీటీడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎర్రచందనం దారి మళ్ళిస్తున్నారని, అడవులను నాశనం చేయడం వల్లనే అక్కడున్న జంతువులు జనావాసాలకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వాపోయారు. సీఎం నివాసం దగ్గరలోనే అత్యాచార ఘటన మాయని మచ్చగా మిగిలిపోతుందని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.

కమిటీలు పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి

బీజేపీని సంస్థాగతగా బలోపేతం చేసుకోవాలి అని దగ్గుబాటి పురంధేశ్వరి సూచించారు. కమిటీలు పటిష్టంగా వుండేలా చూసుకోవాలని పధాధికారుల సమావేశంలో నేతలకు సూచించారు. బీజేపీ అనుబంధ మోర్చాలు మరింత పటిష్టం చేయాలన్నారు. విశ్వ కర్మ పథకం 17న ప్రధాని ప్రారంభిస్తారు. తద్వారా 17 రకాల చేతి వృత్తిదారులకు ఉపయోగ పడుతుంది అని అన్నారు. దేశంలో 700 వందన్ కేంద్రాలు ద్వారా గిట్టుబాటు ధరలు ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. పోలవరం కేంద్రం నిధులతో నిర్మాణం జరుగుతుందని,ఇందులో డిజైనింగ్ లోపం వైసీపీ ప్రభుత్వం బాధ్యతే అని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం అన్యాయం చేసే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాకి దీటుగా ప్యాకేజీకి అప్పటి సీఎం బాబు అంగీకారం తెలిపారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని నేతలకు సూచించారు. విద్యుత్ చార్జీలు 9 సార్లు పెంచినా ఇప్పటికీ అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారుతోందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహా ఇన్‌చార్జి సునీల్ దేవధర్ , బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బిట్రశివన్నారాయణ, గారపాటి సీతారామాంజనేయ చౌదరి, దయాకర్ రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, తదితరులతో పాటు నూతన కమిటీ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed