సభలో గందరగోళం

by S Gopi |
సభలో గందరగోళం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి అని గవర్నర్ అబ్ధుల్ నజీర్ తెలిపారు. సాగు భూములకు నీరందించడం, తాగునీరందించడం అలాగే పారిశ్రామిక అవసరాలను తీర్చడం కోసం ప్రాధాన్యతపై పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనులు, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని గవర్నర్ తెలిపారు. 54 జలయజ్ఞం నీటిపారుదల ప్రాజెక్టులలో 14 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని 2 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తి చేసినట్లు గవర్నర్ వెల్లడించారు. రాబోయే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులను దశల వారీగా పూర్తి చేస్తామని తెలిపారు.

ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సవరించిన వ్యయ అంచనాలకు సత్వరమే ఆమోదం తెలపాలని కోరినట్లు వివరించారు. కాలువ పనులతోపాటు ప్రధాన డ్యామ్‌లో 79.07 శాతం వరకు పనుల అంశం సమగ్ర నిర్వహణ ఇప్పటికే పూర్తైందని తెలిపారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పాదన సదుపాయంతోపాటుగా ఎల్ఏ అండ్ ఆర్ఆర్ పనులలో 22.16 శాతం పనులు పూర్తైనట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కింద 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించబడుతుందని తెలిపారు. 23.5లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమవుతుందని తెలిపారు.

అయితే నీటిపారుదల రంగంపై గవర్నర్‌ అబ్ధుల్ నజీర్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు తమ నిరసన తెలిపారు. గవర్నర్ అసత్యాలు చెప్తు్న్నారని మండిపడ్డారు. నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఎలాంటి పురోగతి లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పీఏసీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గవర్నర్ ప్రసంగంపై అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని.. ప్రాజెక్టులు తిరోగమన దశలో ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ కరపత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ చదివి వినిపించారని పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story