ఆ ఇద్దరి తీరుతో ఇక్కట్లలో వైసీపీ.. ప్రధాన నేతలు నోరువిప్పరా ?

by Y.Nagarani |
ఆ ఇద్దరి తీరుతో ఇక్కట్లలో వైసీపీ.. ప్రధాన నేతలు నోరువిప్పరా ?
X

దిశ ప్రతినిధి, కర్నూలు: ఎస్సీ రిజర్వుడు స్థానాలైన కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఇంచార్జుల తీరుతో ఆ పార్టీ శ్రేణులకు ఇక్కట్లు తప్పడంలేదు. ఇద్దరూ స్థానికేతరులు కావడం, వృత్తి రీత్యా ఇద్దరూ వైద్యులు కావడంతో నియోజకవర్గాల్లో కనిపించకుండా వృత్తిపరమైన సేవలకే పరిమితమయ్యారు. ప్రధాన ఘటనలు చోటు చేసుకుంటే తప్ప నియోజకవర్గాల్లో కన్పించరు. వీరి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రధాన నేతలూ మౌనం వహించడంతో ఆ పార్టీ శ్రేణులకు దిక్కుతోచడంలేదు. రెండు నియోజకవర్గాల్లో ఎవరిని కలవాలలో తెలియక సతమతమవుతున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాను క్లీన్ స్వీప్ చేయగా 2024లో కూటమి 12 గెలువగా వైసీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే ఎస్సీ రిజర్వుడు స్థానాలైన కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలు, శ్రేణుల్లో అంతర్మథనం నెలకొంది. ఓటమి తర్వాత వారు రెండు, మూడు సార్లు మినహా మిగతా రోజుల్లో కనిపించిన దాఖలాల్లేవు. కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువైన సంధ్యా విక్రమ్ కుమార్ టికెట్ ఆశించి భంగపాటుకు గురయ్యారు. అలాగే నందికొట్కూరు సెగ్మెంట్ లో ఐదారుగురు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. వైసీపీ అధినేత జగన్ స్థానికులను కాదని స్థానికేతరులైన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు, ఆదిమూలపు సతీష్ కు కోడుమూరు టికెట్, కడపకు చెందిన ధారా సుధీర్‌కు నందికొట్కూరు టికెట్‌ను కేటాయించారు. తీరా ఓటమి తర్వాత వీరిరువురూ నియోజకవర్గంలో కనిపించడంలేదు. వృత్తి రీత్యా వీరిద్దరూ వైద్యులు కావడంతో వారి వారి వృత్తుల్లో బిజీబిజీగా గడుపుతూ బాధ్యతలను విస్మరించారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలో వారికి అండగా ఉండి భరోసా కల్పించాల్సిన ప్రధాన నేతలు మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు మౌనం వహించడం గమనార్హం. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు వైసీపీని వీడి సైకిలెక్కుతున్నారు.

కోడుమూరు ఇంచార్జిగా తెరపైకి సంధ్యా విక్రమ్ పేరు ?

వైసీపీ రాష్ర్ట కమిటీ సభ్యులు సంధ్యా విక్రమ్ కుమార్ వైసీపీ ఆవిర్భావం నుంచి కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వెంటే ఉంటూ పార్టీ కోసం పని చేస్తున్నారు. హర్షవర్ధన్ రెడ్డి సారథ్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 12 ఏళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తూ వస్తున్నారు. ప్రజలతో మమేకమౌతూ పార్టీతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లిన యువ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్‌కు వైసీపీ అధిష్టానం 2024లో టికెట్ ఇవ్వలేదు. అయినా పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఓటమి తర్వాత సంధ్యా విక్రమ్ కుమార్ మాత్రమే కనిపిస్తున్నారు తప్ప ఇంచార్జి కనిపించిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం రావాలంటే సంధ్యా విక్రమ్ కుమార్‌ను ఇంచార్జిగా నియమిస్తేనే సాధ్యమవుతుందనే యోచనకు వైసీపీ అధినేతలు వచ్చినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed