ఆ నియోజకవర్గంలో గెలిపించేది పథకాలా..సెంటిమెంటా!

by srinivas |   ( Updated:2023-11-05 10:54:36.0  )
ఆ నియోజకవర్గంలో గెలిపించేది పథకాలా..సెంటిమెంటా!
X

దిశ, కర్నూలు ప్రతినిధి: కాలజ్ఞానం రాసిన బ్రహ్మ నడయాడిన ప్రాంతమైన యాగంటి క్షేత్రం ఉన్న ప్రాంతమైన బనగానపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పొలిటికల్ వార్ నడుస్తోందా?, ఈసారి ఎన్నికల్లో వీరిద్దరి మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉందా?, వివిధ కార్యక్రమాలతో ఇరు నేతలు దూసుకుపోతున్నారా?, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి సారిస్తుండగా మాజీ ఎమ్మెల్యే మాత్రం సానుభూతితో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఓటర్లు, ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. రానున్న ఎన్నికల కోసం ఇరువురు నేతలు సన్నద్ధమౌతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. అయితే అధికార పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో మరో మాజీ ఎమ్మె్ల్యే బిజ్జం మౌనం వహించడం కొసమెరుపు.

ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంగా 2008లో పురుడు పోసుకుంది. ఈ సెగ్మెంట్‌లో ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 2,38,803 మంది ఓటర్లున్నారు. భవిష్యత్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందులో పురుషులు 1,17,924 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,20,847 మంది ఉన్నారు. ఓవరాల్‌గా 3,077 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, కొయిలకుంట్ల, సంజమాల మండలాలున్నాయి. 2009లో నియోజకవర్గంలో మొదటి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా రామకృష్ణా రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఎర్రబోతుల వెంకటరెడ్డి బరిలో నిలిచారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు 55,438 ఓట్లు రాగా ప్రత్యర్థి అభ్యర్థి చల్లాకు 41,752 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎర్రబోతులకు 39,611 ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాటసాని రామిరెడ్డి ప్రత్యర్థులపై 13, 686 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున బీసీ జనార్ధన్ రెడ్డి, వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ పడ్డారు.

అయితే టీడీపీ అభ్యర్థి బీసీకి 95,727 ఓట్లు రాగా, కాటసానికి 78,386 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి బీసీ ప్రత్యర్థి కాటసానిపై 17,341 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని, టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్ధన్ రెడ్డిలు పోటీ పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు 99,998 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బీసీకి 86,614 ఓట్లు వచ్చాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని ప్రత్యర్థి అభ్యర్థి బీసీపై 13,384 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. రానున్న 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని, టీడీపీ తరపున బీసీ జనార్ధన్ రెడ్డి మరోసారి పోటీ పడనున్నారు.

పథకాలా..సెంటిమెంటా !

నియోజకవర్గంలో ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. నంద్యాల జిల్లాలో డోన్ నియోజకవర్గం తర్వాత వంద పడకల ఆస్పత్రిని నిర్మించారు. కొలిమిగుండ్లలో భారీ ఖర్చు చేసి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అలాగే కుందూనది వెడల్పు పనులు చేపట్టారు. అలాగే ప్రభుత్వ పరంగా పలు సంక్షేమ పథకాలతో అనేక మంది లబ్ధి పొందారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే రానున్న ఎన్నికల్లో వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని ప్రచారం చేస్తున్నారు. జగనన్న సురక్ష, గడపగడపకు వైసీపీతో పాటు ఇతర కార్యక్రమాలతో ప్రజలకు చేరువౌతున్నారు. అదే క్రమంలో టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి సెంటిమెంట్‌తో ముందుకెళ్లున్నారు. ఈసారి టీడీపీకి పట్టం కట్టాలని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పరిస్థితులు చాలా వరకు మారిపోయాయని, టీడీపీ గ్రాఫ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర, చంద్రబాబు పర్యటనలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే అనధికార పీఏ తీరు బీసీకి ప్లస్ పాయింట్‌గా మారిందని నియోజకవర్గ నాయకులు చర్చించుకుంటున్నారు.

ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డికి పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతో కొంత కాలం పాటు స్థబ్ధుగా ఉంటూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు వార్తలు విన్పిస్తున్నా అందులో వాస్తవం లేదని ఆయన అనుచరులు కొట్టిపారేస్తున్నారు. అయితే ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి సపోర్టు చేస్తారా ? లేక ఏ పార్టీలోకి వెళ్లకుండా మౌనంగా ఉంటారా ? అనే విషయంపై స్పష్టత లేదు. ఏదేమైనా రానున్న ఎన్నికలు పోటా పోటీగా సాగే అవకాశం ఉందని, ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed