Where is Mother Tiger: తల్లిపులిని మరిచిన పులి కూనలు?

by srinivas |
Where is Mother Tiger: తల్లిపులిని మరిచిన పులి కూనలు?
X

దిశ, కర్నూలు ప్రతినిధి : అడవి గడప దాటి జనావాసం చేరిన పులి కూనలను తల్లిపులి చెంతకు చేర్చడంలో అన్నీ తప్పిదాలే కన్పిస్తున్నాయి. అటు గ్రామస్తులు వాటిని పట్టుకుని గ్రామంలోని ఓ నిర్మాణ గోదాములో ఉంచడం..మరోవైపు అటవీ అధికారులు వాటిని సంరక్షణ పేరుతో ఆత్మకూరు తరలించడం వంటి వాటితో పులి కూనలు తల్లిపులిని మరచేలా చేశారు. అటవీ అధికారులు ఒకవైపు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయంటూనే మరోవైపు వాటి సహజ సిద్ధ వాతావారణానికి దూరం చేశారు. వీటితో పాటు తల్లిపాలకు బదులు కెమికల్‌తో కూడిన పాలు, బాయిలర్ కోడి లివర్లను ఆహారంగా ఇవ్వడంతో అవి తమ ప్రాశస్థాన్ని కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలో పిల్లలను తల్లిపులి చెంతకు చేర్చే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అటవీ అధికారులు ప్లాన్-బి అమలు చేసి చేతులు దులుపుకునే యోచనలో ఉన్నారు. అదే జరిగితే పులి పిల్లలు తమ సహజ సిద్ధ లక్షణాలను కోల్పోయే ప్రమాదం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

పెద్ద గుమ్మడాపురంలో 4 పులి పిల్లలు లభ్యం

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అభయారణ్య ప్రాంతమై పెద్ద గుమ్మడాపురం గ్రామంలోకి 4 పులి పిల్లలు దారి తప్పి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరగడం యావత్ భారతదేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఏకంగా 4 పులి కూనలు అభయారణ్యం వీడి జనారణ్యంలోకి వచ్చాయా ? లేక బలవంతంగా గ్రామస్తులు తీసుకొచ్చారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పిల్లలకు పాలు అందించేందుకు తల్లిపులి ఆహారం కోసం వేటకు వెళ్లిన క్రమంలో గ్రామ శివారు ప్రాంతంలోని చెక్ డ్యాంకు 500 మీటర్ల దూరంలోని దోవకుంట, సుద్దకుంట వాగు ప్రాంతంలో లభ్యమైనట్లు చెబుతున్న గ్రామస్తులు పులి కూనలను ఇష్టానుసారంగా పట్టుకుని వాటితో సెల్ఫీలు దిగి రచ్చ రచ్చ చేశారు.

అంతటితో సంతృప్తి చెందని గ్రామస్తులు గ్రామంలోకి తీసుకొచ్చి నిర్మాణ దశలో ఉన్న వ్యవసాయ గోదాములో ఉంచారు. అందులో సిమెంట్ బెడ్, కెమికల్‌తో కూడిన పెయింట్ ఉండడంతో పులి పిల్లలు ఆవాస కాలుష్య ప్రాంతంలోకి నెట్టివేయబడినట్టైంది. ఈ కెమికల్ ప్రభావం పులి పిల్లల శ్వాసకోస నాళాలపై పడే ప్రభావం లేకపోలేదు. పిల్లలు పరిమితితో కూడిన అడుగులు వేస్తూ తల్లి వెంట నడుస్తాయి. అలాంటి వాటిని ఒకేసారి గోదాములో పడేయడంతో అవి గందరగోళానికి గురయ్యాయి. అలాగే గ్రామస్తులు అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందజేసే రసాయన పదార్థంతో కలిసిన జగనన్న పాకెట్ పాలు తాపించారు.

కొత్త ప్రపంచంలోకి పులి కూనలు

పెద్ద పులులు, వన్యప్రాణులకు స్వర్గమైన నల్లమల అటవీ ప్రాంతం నుంచి పులి కూనలు అధికారులు, గ్రామస్తులు కొత్త ప్రపంచంలోకి ప్రవేశించేలా చేశారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి కూనలను గ్రామస్తులు గ్రామంలోకి తీసుకురాగా వాటిని సంరక్షణ పేరుతో అటవీ అధికారులు మరో కొత్త ప్రపంచంలోకి తీసుకొచ్చారు. దీంతో పిల్లలు తమ సహజ లక్షణాలను కోల్పోయాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో అధికారులు ఆత్మకూరు పట్టణంలోని అటవీశాఖ అతిథి గృహంలోని ఓ ఏసీ గదిలో పులి పిల్లలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచారు. వీటికి గదిలో గ్రీన్ కార్పెట్, ఎఈడీ లైట్లు, ఏసీ వంటి కృత్రిమ వాతావరణంలో ఉంచారు. ఈ సమయంలో అవి తమ సహజత్వాన్ని కోల్పోయి మెల్లగా కృత్రిమ వాతావరణానికి అలవాటు పడే అవకాశం ఉంది. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు చెబుతూనే వీటిని తల్లిపులికి దూరం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలను రిస్క్‌లో పెట్టడం దేనికని కొందరు రాష్ర్ట స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు తమ సొంత నిర్ణయాలతో పులి కూనలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.

ప్లాన్-ఎ విఫలం

మరోవైపు అటవీ అధికారులు అమలు చేసిన ప్లాన్-ఎ విఫలమైంది. 300 మంది సిబ్బంది, 40 కెమెరా ట్రాప్‌లతో పిల్లలను కలిపే ప్రయత్నం చేసింది. కానీ అది విఫలమైంది. పెద్దపులి సంచరించిన ప్రాంతాలైన ముసలిమడుగు, గుమ్మడాపురం గ్రామాల సమీపంలో రెండు వేర్వేరు చోట్లా తల్లిపులి పాద ముద్రికలను గుర్తించారు. ఈ రెండు ముద్రలు కూడా ఒకే పులి వని, ఆ పులి తప్పిపోయిన టీఎఫ్-108 అని చెబుతున్నా పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో చేపట్టిన ఆపరేషన్ మదర్ టైగర్ విఫలమైంది. పాద ముద్రలు గుర్తించిన వెంటనే వాటికోసం అన్వేషించే క్రమంలోనే పులి కూనలను తీసుకొచ్చి ఉంటే పులి పిల్లలు తల్లి చెంతకు చేరేవని, పాదముద్రలు గుర్తించిన తర్వాత అర్ధరాత్రి సమయంలో పిల్లలను కలిపే యత్నం చేయడం పట్ల జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. దీంతో చేసేది లేక తల్లిపులి కలవదేమోనని భావించి ప్లాన్-బి దిశగా అడుగులు వేస్తున్నారు. అంటే అంతిమంగా రెండ్రోజుల్లో తిరుపతి జూకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లేకపోతే పులి కూనల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నందున జూకు తరలించి చేతులు దులుపుకోవాలనే యోచనలో అధికారులున్నారు.

Next Story