నామినేటెడ్ పదవులపై అధినేత ఫోకస్... కర్నూలు లిస్ట్ రెడీ..!

by srinivas |
నామినేటెడ్ పదవులపై అధినేత ఫోకస్... కర్నూలు లిస్ట్ రెడీ..!
X

దిశ ప్రతినిధి, కర్నూలు: నామినేటెడ్ పదవులపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ రెండు, మూడు వారాల్లో కార్యరూపం దాల్చనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాకు చెందిన చాలా మంది ఆశావహులు నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

సీఎం ఉద్దేశం అదే..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 12 స్థానాలు గెలవగా వైసీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టింది. తొలి విడతగా ముఖ్యమైన ఆలయాలతో పాటు 25 ప్రధాన కార్పొరేషన్ చైర్మన్‌ పదవులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకు న్నారు.

ఎవరు ఎవరి కోసం త్యాగం చేశారంటే..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు ఆదేశాల మేరకు కొందరు తమ స్థానాలను త్యాగం చేశారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, కోట్ల సుజాతమ్మ, మీనాక్షినాయుడు, దర్మవరం సుబ్బారెడ్డి, పాలకుర్తి తిక్కారెడ్డి, మాండ్ర శివానందరెడ్డి తదితరులు ఇతరుల కోసం తమ సీట్లను త్యాగం చేశారు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రస్తుత మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కోసం, ఆలూరులో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ వీరభద్ర గౌడ్ కోసం, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కోసం, డోన్ లో ధర్మవరం సుబ్బారెడ్డి మాజీ కేంద్ర సహాయ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కోసం, మంత్రాలయంలో ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి రాఘవేంద్రా రెడ్డి కోసం త్యాగాలు చేశారు.

శబరి కోసం శివానందరెడ్డి..

నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రస్తుత ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోసం, పత్తికొండ, డోన్, ఆలూరు టికెట్లు ఆశించిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు, పాణ్యం, శ్రీశైలంలో సీట్లు ఆశించిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డికి కూడా అధిష్టానం మొండిచేయి చూపింది. పత్తికొండలో తండ్రికి బదులు తనయుడు కేఈ శ్యాంబాబు కోసం తమ సీట్లను త్యాగం చేశారు. పలు నియోజకవర్గాల్లో సీట్లు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గానీ, రాష్ర్ట కేబినెట్ స్థాయి కలిగిన కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఆశిస్తున్నారు. వీరితో పాలు పార్లమెంట్, నియోజకవర్గ ఇంచార్జులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి, టీడీపీ రాష్ర్ట కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి, గుడిసె కృష్ణమ్మ, ఉమ్మిసలీం, మాజీ రాష్ర్ట లింగాయత్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, అంబాల రామకృష్ణారెడ్డి, మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతుల రఘురామిరెడ్డి, పాణ్యం జనసేన పార్టీ నుంచి చింతా సురేష్ లు నామినేటెడ్ పదవులు ఆశించేవారిలో ఉన్నారు.

అయితే కుడా చైర్మన్ పదవి కోసం కోడుమూరు ఇంచార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డిలు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు ఐదు చైర్మన్ పదవులతో పాటు రాష్ట్ర స్థాయిలో 8 డైరెక్టర్ పోస్టులు జిల్లాకు ఇవ్వనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed