Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

by srinivas |
Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
X

దిశ, నందికొట్కూరు: అప్పులు తెచ్చి ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట దిగుబడి రాకపోవడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో జరిగింది. బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన రైతు కుర్వ చంద్రుడు (55) తనకున్న నాలుగెకరాల పొలంతో పాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప, ఉల్లి సాగు చేశారు. పంటల సాగు నిమిత్తం దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు. ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికం కావడం, అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గ్రామ శివారులోని కుంట వద్ద వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాఠశాలకు వెళుతున్న విద్యార్థులు గమనించి పెద్దలకు సమాచారం అందించారు. మృతుడిని గుర్తించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న బ్రాహ్మణకొట్కూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు బ్రాహ్మణకొట్కూరు ఎస్సై ఓబులేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి వివాహితులైన ఒక కుమార్తె , కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని వైసీపీ నాయకులు ఉదయ్ కిరణ్ రెడ్డి, ఓంకార రెడ్డి, పుల్లయ్య తదితరులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed